ఒక్క స్కూలూ మూతపడొద్దు
ABN , First Publish Date - 2021-05-20T08:39:34+05:30 IST
రాష్ట్రంలో ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదనీ, ప్రతి స్కూలూ వినియోగంలో ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ‘నాడు-నేడు’ కింద అన్నిరకాల

అందరూ ఆంగ్ల విద్యను అందుకోవాలి
‘నాడు-నేడు’ పై సమీక్షలో సీఎం
అమరావతి, మే19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదనీ, ప్రతి స్కూలూ వినియోగంలో ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ‘నాడు-నేడు’ కింద అన్నిరకాల స్కూళ్లు, అంగన్‌వాడీలను అభివృద్ధి చేయడం వెనుక లక్ష్యమిదేనన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన స్కూళ్లు, అంగన్‌వాడీల్లో ‘నాడు-నేడు’పై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొనే విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకమని, ఆప్యాయతతో మన లక్ష్యాలను వారికి వివరిస్తే.. మంచి పనితీరును సాధించడం సాధ్యమేనని ఈ సందర్భంగా జగన్ అన్నారు. స్కూళ్ల నిర్వహణ, టీచర్లని వినియోగించడంలో జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు.
పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలని, పిల్లలకు 2 కిలోమీటర్ల దూరం లోపలే బడి ఉండాలని అన్నారు. ‘‘అంగన్‌వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి. రూపొందించిన పాఠ్యాంశాలను వాళ్లు పిల్లలకు బోధించగలగాలి. పెద్దవాళ్ల పిల్లల మాదిరిగా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీషులో మంచి విద్యను అందుకోనేలా చర్యలు తీసుకోవాలి. పాఠ్యప్రణాళిక పటిష్ఠంగా ఉండాలి. ‘నాడు-నేడు’ కింద బాగుచేసిన భవనాల నిర్వహణపై దృష్టి పెట్టాలి. రూ.వేల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి భవనాలను బాగా చూసుకోవాలి’’ అని సూచించారు. అవసరమైన చోట స్కూళ్లలో అదనపు తరగతి గదులను నిర్మించాలని ఆదేశించారు. అనంతరం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అంగన్‌వాడీ టీచర్ల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీషు పుస్తకం, సీడీలను సీఎం జగన్ ఆవిష్కరించారు. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ.. శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను అధికారులు ఆయనకు చూపించారు. అనంతరం సమీక్షలో, రాష్ట్రంలో 10 మంది కన్నా తక్కువగా పిల్లలు ఉన్న స్కూళ్లు, అలాగే 30 మంది కన్నా పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల పిల్లల సంఖ్య తక్కువ, టీచర్లు ఎక్కువగా ఉన్న స్కూళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. స్కూళ్లను సమర్థవంతంగా వినియోగించడానికి, టీచర్ల సేవలను సమర్థవంతంగా వాడుకోవడానికి జాతీయ మార్గదర్శకాలప్రకారం కొన్ని ప్రతిపాదనలను అధికారులు చేశారు.
పిల్లలు తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్ వాడీ పిల్లలను కలుపుకొనేట్టుగా చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు, ప్రస్తుతం ఉన్న టీచర్లు వీరికి విద్యాబోధన చేస్తారన్నారు. దీనివల్ల శిక్షితులైన ఉపాధ్యాయులు వారికి ప్రాథమిక దశ నుంచే మంచి బోధన ఇవ్వగలరని, అలాగే స్కూళ్లు కూడా సమర్థవంతంగా వినియోగపడతాయని అధికారులు వివరించారు. అవకాశంఉన్న చోట మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కూడా హైస్కూల్ పరిధిలోకి తీసుకురావాలని, అప్పర్ ప్రైమరీ స్కూళ్లను హైస్కూళ్లుగా మార్చాలని అధికారులు ప్రతిపాదించారు. సమీక్ష లో విద్యాశాఖ మంత్రి సురేశ్, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి వనిత, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.ఆర్.అనూరాధ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్, పాఠశాల విద్యా కమిషనర్ చినవీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.