అమ్మే హక్కు ఎవరికీ లేదు: సీఐటీయూ
ABN , First Publish Date - 2021-02-26T07:22:23+05:30 IST
స్టీల్‌ప్లాంట్ ప్రజల సంపద అని, దీన్ని అమ్మే హక్కు ఎవరికీ లేదని సీఐటీయూ నగర అధ్యక్షుడు జగ్గునాయుడు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ముఖద్వారం వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో...

కూర్మన్నపాలెం (విశాఖపట్నం), ఫిబ్రవరి 25: స్టీల్‌ప్లాంట్ ప్రజల సంపద అని, దీన్ని అమ్మే హక్కు ఎవరికీ లేదని సీఐటీయూ నగర అధ్యక్షుడు జగ్గునాయుడు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ముఖద్వారం వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరం 14వ రోజు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని వైఖరి చూస్తుంటే.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోందన్నారు. స్టీల్‌ప్లాంట్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ వర్క్సు) టీపీ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి కార్మికులకు ఆమోదయోగ్యంగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో నడపాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ అయోధ్యరామ్ మాట్లాడుతూ ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని.. దాన్ని ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోస్కోను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వబోమని, ప్రైవేటీకరణ ప్రక్రియను వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. పోరాట కమిటీ నేతలు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, బొడ్డు పైడిరాజు, మస్తానప్ప తదితరులు పాల్గొన్నారు.