‘హోదా’ ముగిసింది!
ABN , First Publish Date - 2021-03-24T09:35:59+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించేది లేదని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. 14వ ఆర్థిక సంఘం నివేదికతోనే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించే అంశం ముగిసిందని స్పష్టంచేసింది. ప్రత్యేక హోదాకు బదులుగా

ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ప్రకటించం
మా వద్ద పెండింగ్ హామీలేమీ లేవు
మిగతావి రెండు రాష్ట్రాలే తేల్చుకోవాలి
మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టీకరణ
అవమానకర సమాధానమిది రామ్మోహన్‌నాయుడి అసంతృప్తి
హోదా, హామీల అమలు కోసం తెలుగు ప్రజల ఎదురుచూపులు
దీనిపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్
ప్యాకేజీ వద్దు.. హోదానే కావాలి: మిథున్
న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించేది లేదని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. 14వ ఆర్థిక సంఘం నివేదికతోనే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించే అంశం ముగిసిందని స్పష్టంచేసింది. ప్రత్యేక హోదాకు బదులుగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ ప్రయోజనాలు కల్పించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలేవీ తమ వద్ద పెండింగ్‌లో లేవన్నారు. మిగతా అంశాలపై రెండు రాష్ట్రాలూ కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు రాయ్ సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలను సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కారించాల్సి ఉంటుందని, అందులో భాగంగా పలుసార్లు ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్దేశించామని.. సూచనలు ఇచ్చామని ఆయన తెలిపారు. ‘రెండు రాష్ట్రాల అభివృద్ధికి విభజన చట్టంలో అనేక నిబంధనలు ఉన్నాయి. పెండింగ్ హామీల అమలుకు మేం రెండు రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి ఉంది. అందులో కేంద్రం లేదా కేంద్ర హోం శాఖ జోక్యం ఏమీ లేదు. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక వాతావరణంలో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం’ అని పేర్కొన్నారు.
ఏమేం చేశారో సూటిగా చెప్పండి..
కేంద్రం అమలు చేయాల్సిన హామీల మాటేమిటని రామ్మోహన్ ప్రశ్నించారు. ఏమేమి అమలు చేశారో సూటిగా చెప్పాలన్నారు. 2014లో రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదించిన సమయంలో ప్రత్యేక హోదా ప్రకటిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సభలో హామీ ఇచ్చారని, ఎన్నికల ముందు ఏపీకి హోదా కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇవ్వడమేకాకుండా బీజేపీ మేనిఫెస్టోలో కూడా చేర్చారని, రాష్ట్రానికి హోదా తీసుకొస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ పరిణామాల రీత్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, కాబట్టి దాని సంగతేమిటని అడిగారు. ‘ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా కల్పించవద్దని 14వ ఆర్థిక సంఘం స్పష్టంగా పేర్కొంది. విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం.
2014-15 నుంచి 2019-20 వరకు రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున 7 జిల్లాలకు కలిపి రూ. 1,400 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది’ అని కేంద్ర మంత్రి చెప్పబోతుండగా రామ్మోహన్ అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తారో లేదో తేల్చాలని డిమాండ్ చేశారు. ‘అందులో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. 2014 -20 మధ్య ఏపీకి రూ.22,113 కోట్లు రెవెన్యూ లోటు కింద 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. దాని ప్రకారం రాష్ట్రానికి రూ.22,111 కోట్లు విడుదల చేశాం. 2020-21కి గాను 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.5,897 కోట్లు కూడా ఇచ్చేశాం’ అని స్పష్టం చేశారు. విభజన చట్టానికి సంబంఽధించి 32 అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు లేఖ రాసిందని, అందులో ఉన్న అంశాలు రెండు రాష్ట్రాల మధ్య అంశాలేనని తెలిపారు. వాటిని తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని, స్పందన రాలేదన్నారు. వీటిని రెండు రాష్ట్రాలూ కలిసి పరిష్కరించుకోవలసిందేనని తేల్చిచెప్పారు.
ఈ సమాధానంపై రామ్మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నకు సరైన జవాబివ్వకుండా అవమానకరంగా, బాధ్యతారాహిత్య సమాధానం ఇచ్చారని విమర్శించారు. ఈ సమాధానం చూస్తుంటే కేంద్రానికి ఆసక్తి, జ్ఞానం లేనట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ‘విభజన హామీలు ఎంత మేరకు అమలు చేశారు..? పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడానికి కారణాలేంటి..? ఎప్పటిలోగా పూర్తిచేస్తారని అడిగితే.. చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అమలు చేశామంటారు. విభజన చట్టంలోని హామీలు, అంశాల అమలుపై శ్వేతపత్రం విడుదలకు కేంద్ర మంత్రి సిద్ధంగా ఉన్నారా..? దాంతో తెలుగు ప్రజలకు నిజాలు తెలుస్తాయి. పదేళ్లలో హామీల అమలు పూర్తి చేయాలని చట్టంలో ఉంది. కానీ ఇప్పటికే ఏడేళ్లు గడిచిపోయాయి’ అని అన్నారు.
అనేక హామీలు అమలు కాలేదు: వైసీపీ
ప్రత్యేక హోదాపై తిరుపతిలో మోదీ హామీ ఇచ్చారని మిథున్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాము ఎటువంటి ప్యాకేజీని అంగీకరించేది లేదని... ప్రత్యేక హోదానే కావాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను పదేళ్లలో అమలు చేయాలని విభజన చట్టంలో ఉందని, ఇప్పటికే ఏడేళ్లు పూర్తయినా అనేక హామీలు అమలు కాలేదని, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సమాధానమిస్తూ... ‘14వ ఆర్థిక సంఘం నివేదికతో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించడం ముగిసింది. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ రూపంలో కేంద్ర ఆర్థిక శాఖ ఏపీకి ప్రయోజనాలు కల్పించింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం మంత్రి అనేక సార్లు సమావేశమై వివిధ అంశాలను పరిష్కరించారు’ అని తెలిపారు.
రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలేమీ పరిశీలనలో లేవని వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి అంటున్నారని, అలాంటి వివాదమేంటో ఉంటే నిర్దిష్టంగా చెబితే పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలూ లేవన్నారు. రాయ్ సమాధానమిస్తూ.. ‘రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయని నేననలేదు. పలు అంశాలపై అవే చర్చించుకోవాలన్నాను. దానికి కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుంది’ అని చెప్పారు.