ఉచిత బియ్యంలేవు

ABN , First Publish Date - 2021-12-19T08:05:21+05:30 IST

ఉచిత బియ్యంలేవు

ఉచిత బియ్యంలేవు

కేంద్రం ఇస్తున్నా కరుణించని వైసీపీ ప్రభుత్వం.. కొవిడ్‌ నేపథ్యంలో పేదలకు పాట్లే

ఉచితమివ్వకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులను ఏం చేస్తారు?


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘పేదల సంక్షేమం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నాం. వారి సంక్షేమం కోసం అవసరమైతే మరిన్ని అప్పులు చేయడానికైనా వెనుకాడం’’ అంటూ వైసీపీ ప్రభుత్వం పదే పదే ఆర్భాటంగా ప్రకటిస్తూంటుంది. కాని అదే పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్‌ బియ్యం విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ‘డిసెంబరు నెల ఉచిత బియ్యం కోటా ఇవ్వడం లేదు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ డీలర్లకు తేల్చి చెప్పింది. ‘జనవరిలోనైనా ఇస్తారా? ఇస్తే డిసెంబరులో ఆపిన బియ్యాన్ని కూడా కలిపి ఇస్తారా?’ అన్న అంశాలపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1.44 కోట్ల పేద కుటుంబాలు మనిషికి 5 కిలోల చొప్పున, ఒక్కో కుటుంబం సగటున 15 కిలోల బియ్యాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొవిడ్‌ కాలంలో పనులు లేకపోవడంతో పేదలు పూర్తిగా ఈ రేషన్‌ బి య్యంపైనే ఆధారపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్రం ఏమా త్రం పరిగణలోకి తీసుకోలేదు. వాస్తవానికి కొవిడ్‌ నేపథ్యంలో కార్డుదారులందరికీ మనిషికి 5 కిలోల చొప్పున కేంద్రమే గత 15 నెలలుగా ఉచిత బియ్యం ఇస్తోంది. నవంబరు నాటికి ఆ గడువు ముగిసినప్పటికీ వాస్తవ పరిస్థితుల ఆధారంగా మరో నాలుగు నెలలపాటు ‘ఉచితాన్ని’ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1.44 కోట్ల రేషన్‌ కార్డులున్నాయి. అందులో కేంద్రం 90 లక్షల కార్డులను మాత్రమే గుర్తించింది. వాటికి మాత్రమే కేంద్రం సంపూర్ణ రాయితీ అందిస్తోంది. మిగిలిన 54 లక్షల కార్డులకు రాయితీని రాష్ట్రం భరిస్తోంది. ఈ తిరకాసుతోనే ఉచిత బియ్యం కోటాపై  రాష్ట్రం ఆది నుంచీ వ్యతిరేకతతోనే ఉందని సమాచారం. అంత భారాన్ని మోయడం తమవల్ల కాదని మొత్తుకుంటూనే ఉంది. 


ప్రత్యామ్నాయంగా గోధుమలు ఇవ్వాలి

బియ్యం నిల్వలు లేకపోతే ప్రత్యామ్నాయంగా పేదలకు గోధుమలు ఇవ్వాలని రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం కంటే గోధుమలు తక్కువ ధరకు లభిస్తాయన్నారు. పేదలకు గోధుమలు ఇస్తే పిండిగా మార్చుకుని వంటలు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. 15 నెలలుగా బియ్యం ఇస్తున్నారని, ఈ సారి గోధుమలు ఇవ్వడం వల్ల పేదలకు ఉపయోగకరంగా ఉంటుందని మాధవరావు చెప్పారు. 


సార్టెక్స్‌ భారమే కారణమా!

ఎప్పటికప్పుడు కేంద్రం ‘ఉచితాన్ని’ ముగిస్తుందేమోనని చూస్తున్న రాష్ట్రానికి మరో నాలుగు నెలలు పొడిగిస్తున్నాం అన్న మాట శరాఘాతమైంది. ‘భారం’ భరించలేమన్న భావనతో డిసెంబరు ఉచిత కోటాను ఆపేసింది. అయితే బియ్యం లేకపోవడం అసలు కారణం కాదనీ, సార్టెక్స్‌ చేయని బియ్యం లేకపోవడం వల్లే పంపిణీ ఆపేశారనే వాదన వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాధారణ బియ్యాన్నే సార్టెక్స్‌ చేసి, వాటినే నాణ్యమైన బియ్యం పేరుతో పేదలకు పంపిణీ చేస్తోంది. సాధారణ బియ్యాన్ని సార్టెక్స్‌గా మార్చడం వల్ల కొంత అదనపు ఖర్చు అవుతోంది. ఇప్పటి వరకూ సాధారణ కోటాలో సార్టెక్స్‌ బియ్యం ఇస్తున్న ప్రభుత్వం, రెండో కోటాలో నాన్‌ సార్టెక్స్‌ ఇస్తోంది. ఇప్పుడు నాన్‌ సార్టెక్స్‌ బియ్యం అందుబాటులో లేవు. ఉచితమే భారమనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... సార్టెక్స్‌ బియ్యం వలన కలిగే అదనపు భారాన్ని భరించడానికి అసలు సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే అసలు బియ్యం నిల్వలే లేవని చెబుతోందని తెలుస్తోంది. అయితే అన్ని రాష్ర్టాలకూ ఇచ్చినట్లుగానే కేంద్రం మన రాష్ట్రానికి కూడా ఉచిత కోటా రాయితీని బియ్యంగా కాకుండా నేరుగా నగదుగా ఇస్తోంది. ఉచిత బియ్యమే ఇవ్వనపుడు కేంద్రం నుంచి వచ్చిన ఆ నిధులను ఏం చేస్తారన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.

Updated Date - 2021-12-19T08:05:21+05:30 IST