ఆంధ్ర రోగులకు నో అడ్మిషన్!
ABN , First Publish Date - 2021-05-21T09:45:12+05:30 IST
బ్లాక్ ఫంగస్... ఇది కొత్త కలవరం! దీనికి చికిత్స కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వారిని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో చేర్చుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి

బ్లాక్‌ఫంగస్‌తో కోఠి ఈఎన్‌టీకి బాధితులు
చేర్చుకోవడం కుదరదంటున్న సిబ్బంది
గంటలతరబడి స్ట్రెచర్‌పై గుంటూరువాసి
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): బ్లాక్ ఫంగస్... ఇది కొత్త కలవరం! దీనికి చికిత్స కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వారిని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో చేర్చుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి బ్లాక్ ఫంగస్ రోగులు కోఠి ఈఎన్‌టీకి వచ్చారు. అడ్మిషన్ కోసం ప్రయత్నించగా బెడ్లు లేవని, ఆంధ్ర నుంచి వచ్చేవారిని అడ్మిట్ చేసుకోవడం కుదరదని సిబ్బంది చెప్పినట్లు రోగుల సహాయకులు ఆరోపించారు. కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న గుంటూరువాసి కొండయ్య (70) బ్లాక్ ఫంగ్‌సతో బాధపడుతుండడంతో కుటుంబసభ్యులు బుధవారం ఉదయం 10 గంటలకు కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి తీసుకురాగా.. సాయంత్రం 4.30 దాకా ఆయన ఆస్పత్రి ప్రాంగణంలోనే స్ట్రెచర్‌పై అపస్మారక స్థితిలో ప్రాణాల కోసం పోరాడుతూ కనిపించారు. తొలుత కొండయ్య రిపోర్ట్స్‌ను పరిశీలించిన అక్కడి వైద్య సిబ్బంది.. స్థానికేతరులను ఆస్పత్రిలో చేర్చుకోబోమని చెప్పారు. సహాయకులు వేడుకోవడంతో.. మరోసారి రిపోర్ట్స్ చూసి, ఫంగస్ ఆయన మెదడుకు వ్యాపించిందని తమ వద్ద చికిత్స చేయడం కుదరదని సాయంత్రానికి చెప్పారు. మధ్యాహ్నం దాకా చూసిన అంబులెన్స్ డ్రైవర్, కొండయ్యను స్ట్రెచర్‌పై వదిలేసి వెళ్లిపోయాడు. ఏడు గంటలపాటు అలాగే స్ట్రెచర్‌పై ఉన్న కొండయ్య గొంతు తడిపేందుకు బంధువులు ద్రవపదార్ధాలను నోట్లో పోస్తుండడం పలువురి కంటతడి పెట్టించింది. సా యంత్రం 5 గంటల తర్వాత కొండయ్యను తీసుకుని వెనక్కి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆంధ్ర నుంచి వచ్చినవారు పదుల సంఖ్యలో వెనుదిరిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీనిపైఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌ను వివరణ కోరగా.. ఆస్పత్రిలో ఉన్న 50 బెడ్లు నిండిపోవడంతో కొందరిని అడ్మిట్ చేసుకోలేదని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వారిని చేర్చుకోవడం లేదనే విషయంలో వాస్తవం లేదన్నారు.