YSRCP MLA అన్నీ తానై.. చెరువు కట్టపైనే నిద్ర.. బహిరంగ ప్రదేశంలోనే స్నానం!

ABN , First Publish Date - 2021-11-23T12:42:06+05:30 IST

ఇన్‌ఫ్లో పెరిగే పరిస్థితులు కనిపించడంతో క్షణ క్షణం.. భయం భయంగా గడుపుతున్నారు...

YSRCP MLA అన్నీ తానై.. చెరువు కట్టపైనే నిద్ర.. బహిరంగ ప్రదేశంలోనే స్నానం!

  • భయం భయంగా..!
  • రాయల చెరువు కట్ట లీకేజీని 
  • ఆరా తీస్తున్న అధికారులు, స్థానికులు


తిరుపతి/ రామచంద్రాపురం : రాయలచెరువు ప్రమాద ఘంటికలు జిల్లావాసులను వెంటాడుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి కంట్లో ఒత్తులు వేసుకుని బతుకుజీవుడా.. అంటూ గడిపిన అధికార యంత్రాంగం, స్థానికులు.. సోమవారం ఉదయం కట్ట లీకేజీ పరిస్థితిపై ఆరాతీశారు. శనివారం ఉన్న లీకేజీలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో కాస్త ఊపిరి తీసుకున్నప్పటికీ చెరువులోకి ఇన్‌ఫ్లో పెరిగే పరిస్థితులు కనిపించడంతో క్షణ క్షణం.. భయం భయంగా గడుపుతున్నారు. శనివారం కట్ట నుంచి లీకేజీ వచ్చిందని తెలిసిన వెంటనే దాదాపు 30 గ్రామాల ప్రజలు సురక్షితప్రాంతాలకు వెళ్లి, ఇంకా భయంగుప్పిట్లోనే ఉన్నారు. 


అన్నీ తానై...

రాయలు చెరువు కట్టకు ప్రమాదం వాటిల్లుతుందని గ్రామీణుల ఆందోళనతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అక్కడకు చేరుకుని లీకేజి ప్రాంతాన్ని పరిశీలించి చెరువుకట్టపైనే నిద్రిస్తూ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన బహిరంగ ప్రదేశంలోనే స్నానం చేస్తూ అందుబాటులో ఉన్న ఆహారం తీసుకుంటున్నారు.


అవుట్‌ ఫ్లో పెంచుతున్నాం : చెవిరెడ్డి

కుప్పంబాదూరు ప్రాంతంలో అవుట్‌ ఫ్లో పెంచుతున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. చెరువు కట్ట లీకేజీ దగ్గర 10వేల ఇసుక బస్తాలు వేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇన్‌ఫ్లో కన్నా అవుట్‌ఫ్లో రెండింతలు పెంచుతున్నామని స్పష్టం చేశారు.


మంత్రి పెద్దిరెడ్డి పరిశీలన

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం రాయలచెరువును పరిశీలించారు. జిల్లాలో ఉన్న మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో రాయలచెరువు అత్యంత పురాతనమైనదని, నిపుణుల సూచనల మేరకు పరిరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం జరిగిందని, పరీవాహక ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయించారని పేర్కొన్నారు.


ఆందోళన అవసరంలేదు : ఎస్పీ

రాయలచెరువు విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు పేర్కొన్నారు. రాయలచెరువు వద్ద సహాయక చర్యలను సోమవారం పర్యవేక్షించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అప్పలనాయుడు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 200 మంది కూలీలు చెరువుకట్టకు పడిన గండిని పూడ్చడానికి శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముందుజాగ్రత్తగా ఇప్పటికే లోతట్టు గ్రామాలను ఖాళీచేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు పోలీసు బలగాలను కూడా చెరువువద్ద అందుబాటులో ఉంచామన్నారు. 


ముందస్తు చర్యలపై నిర్లక్ష్యం: టీడీపీ

రాయలచెరువును చిత్తూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు పులివర్తినాని సోమవారం పరిశీలించారు. చెరువుమొరవ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ముందస్తు చర్యలు తీసుకోక పోవడం వల్లే ఇంతటి ప్రమాదకర స్థితికి వచ్చిందన్నారు. ఈ సమయంలో రాజకీయాలు చేయదలుచుకోలేదని, అవసరమైతే టీడీపీ కార్యకర్తలను వలంటీర్లుగా పంపుతామన్నారు. అనంతరం పీకేపల్లె, కాలేపల్లె, రాయలచెరువుపేట గ్రామాల్లో నీటమునిగిన ఇళ్లను పరిశీలించి.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాయలచెరువుపేట గ్రామస్తులకు ట్యాంకు మినరల్‌ వాటర్‌ అందించి, భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి, తిరుపతి రూరల్‌ అధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, జిల్లా నాయకులు జనార్దనచౌదరి, ఢిల్లీనాథరెడ్డి, కోలా హరిప్రసాద్‌, ఉమాపతినాయుడు, ధనంజయరెడ్డి, రవి, గిరిధరరెడ్డి, మణిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T12:42:06+05:30 IST