ప్రీమియంలోనూ ‘కొత్త బ్రాండ్లు’

ABN , First Publish Date - 2021-06-22T08:57:54+05:30 IST

దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం బ్రాండ్లు అందించడానికి కొత్త ప్రణాళికతో ముందుకువచ్చింది. పర్యాటక ప్రాంతాల్లో ఖరీదైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తోంది

ప్రీమియంలోనూ ‘కొత్త బ్రాండ్లు’

మద్యం ప్రియులకు ఇక ఖరీదైన మందు

నిషేధిస్తామన్న సర్కారే కొత్త ప్రణాళిక 

టూరిజం ఫెసిలిటేషన్‌ సెంటర్ల పేరుతో పర్యాటక ప్రాంతాల్లో 100 మద్యంషాపులు 

పర్యాటక, ఎక్సైజ్‌ శాఖలు కలసి ఏర్పాటు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం బ్రాండ్లు అందించడానికి కొత్త ప్రణాళికతో ముందుకువచ్చింది. పర్యాటక ప్రాంతాల్లో ఖరీదైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తోంది. మద్యం ప్రియులకు ప్రీమియం బ్రాండ్లు అందించనుంది. పర్యాటక శాఖ, ఎక్సైజ్‌ విభాగం కలిసి టూరిజం ఫెసిలిటేషన్‌ సెంటర్‌ (టీఎఫ్‌సీ) పేరుతో కొత్త షాపులు ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో 100 షాపులు పెట్టాలనేది లక్ష్యం. విశాఖపట్నంలో పది షాపులు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా బీచ్‌రోడ్డులో అప్పుఘర్‌ వద్ద యాత్రినివాస్‌లో సోమవారం ఒక సెంటర్‌ ప్రారంభించారు. ఇక్కడ ఖరీదైన మద్యం లభిస్తుంది. ప్రీమియం బ్రాండ్లు అని అధికారులు చెబుతున్నప్పటికీ అక్కడ కూడా కొత్త రకాలే ఎక్కువగా కనిపించడం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో ప్రీమియం బ్రాండ్లు దొరకడం లేదు. ఎప్పుడూ వినని బ్రాండ్లను విక్రయిస్తున్నారు. దీంతో విక్రయాలు పెద్దగా సాగడం లేదు.


విశాఖపట్నంలోని ఓ మాల్‌లో మొన్నటివరకు ఎక్సైజ్‌ విభాగం వాక్‌ ఇన్‌ కౌంటర్లు నిర్వహించింది. అక్కడ ఖరీదైన మద్యం లభించేది. చాలామంది అక్కడికి వెళ్లేవారు. ఒప్పందాల విషయంలో తేడాలు రావడంతో ఇటీవల వాటిని మూసేశారు. దీంతో ధనవంతులైన మద్యం ప్రియులను ఆకర్షించడానికి కొత్తగా ‘టీఎఫ్‌సీ’లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వీటిని ఏర్పాటు చేయాలంటే కనీసం 1,500 చ.అ. స్థలం ఉండాలి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రుషికొండ, ఎండాడ, అప్పుఘర్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన చోట్ల ఎక్సైజ్‌ శాఖ ఏర్పాటు చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-06-22T08:57:54+05:30 IST