రాద్ధాంతం తగదు
ABN , First Publish Date - 2021-05-24T10:26:33+05:30 IST
కొవిడ్ నివారణకు ఆయుర్వేద మందును తయారు చేస్తున్న ఆనందయ్యపైన, మందుపైన రాద్ధాంతాలు, దుష్ప్రచారాలు మంచిది కాదని, ప్రజలను రెచ్చగొట్లే ప్రయత్నాలు చేయొద్దని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆనందయ్యతో

కృష్ణపట్నం మందుకు విశేష ఆదరణ: కాకాణి
నెల్లూరు(జడ్పీ)/చంద్రగిరి, మే 23: కొవిడ్ నివారణకు ఆయుర్వేద మందును తయారు చేస్తున్న ఆనందయ్యపైన, మందుపైన రాద్ధాంతాలు, దుష్ప్రచారాలు మంచిది కాదని, ప్రజలను రెచ్చగొట్లే ప్రయత్నాలు చేయొద్దని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆనందయ్యతో కలిసి కాకాణి ఆదివారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. ఆనందయ్యను అరెస్టు చేశారని, ఆయన్ను కొంతమంది నిర్బంధించారని రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఆయన తయారుచేస్తున్న మందుకు విశేషమైన ఆదరణ లభించిందని, దీనిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఆయుష్ బృందంతోపాటు ఐసీఎంఆర్ కమిటీ సభ్యులు మందుపై అధ్యయనం చేస్తున్నారని.. ఆ నివేదికలు వచ్చి ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే మందు పంపిణీ చేస్తామని చెప్పారు.
కాగా.. తననెవరూ నిర్బంధించలేదని, అరెస్టు చేయలేదని.. తాను స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నానని బొణిగి ఆనందయ్య తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే మందు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం ఆనందయ్య మందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారణ అయిందని చెవిరెడ్డి తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆయుర్వేద మందును 60 రోజుల్లో తయారు చేసి యావత్ రాష్ట్రానికి అందించే సామర్థ్యం ఉందన్నారు. అత్యాధునిక ఆయుర్వేద ఫార్మా టీటీడీ పరిధిలో ఉందని చెప్పారు.
ఆనందయ్యకు అనుమతివ్వాలి: నారాయణ
ముత్తుకూరు: కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందును పరిశీలించి పంపిణీకి అనుమతి ఇవ్వాలని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ కోరారు. ఆదివారం ఆయన కృష్ణపట్నంలో పర్యటించారు. మందులో ఉపయోగించే వనమూలికలను పరిశీలించారు.