కల్వకుర్తి టు జమ్మలమడుగు
ABN , First Publish Date - 2021-09-09T09:15:19+05:30 IST
రాష్ట్రంలో ప్రతిపాదిత జాతీయ రహదారుల అలైన్‌మెంట్, రైట్‌ఆఫ్ వే(ఆర్‌ఓడబ్ల్యూ)లో కొన్ని మార్పులు, సవరణలు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కరివెన మీదుగా నంద్యాల వరకు
ఎన్‌హెచ్167కే అలైన్‌మెంట్ పొడిగింపు
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతిపాదిత జాతీయ రహదారుల అలైన్‌మెంట్, రైట్‌ఆఫ్ వే(ఆర్‌ఓడబ్ల్యూ)లో కొన్ని మార్పులు, సవరణలు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కరివెన మీదుగా నంద్యాల వరకు ప్రతిపాదించిన జాతీయ రహదారి 167కేను కడప జిల్లా జమ్మలమడుగు వరకు పొడిగించనున్నారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల వరకు తొలుత జాతీయ రహదారిని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, రాంపూర్ నుంచి కర్నూలులోని మందుగుల, శివపురం, కరివెన నుంచి నంద్యాల వరకు రహదారిని ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు దీనిని కడప జిల్లా జమ్మలమడుగు వరకు పొడిగించారు. నంద్యాల, కానాల, చింతల, కోయిలకుంట్ల, నొస్సం నుంచి జమ్మలమడుగకు రహదారిని తీసుకెళ్లి ఎన్‌హెచ్-67తో అనుసంధానం చేయనున్నారు. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారి శాఖ డైరెక్టర్ రాజే్‌షగుప్తా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంతకుముందు 890 కోట్లతో ఈ రహదారి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు దీని వ్యయం 1300 కోట్లకు చేరుకోనుందని అంచనా. ఈ రహదారిని నాలుగు వరసలుగా నిర్మించనున్నారు. సోమశిల-సిద్దేశ్వరం వద్ద కృష్ణాన దిపై భారీ వంతెన నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే , కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతపురం జిల్లా హిందూపురం వరకు ప్రతిపాదించిన జాతీయ రహదారి 716జి అలైన్‌మెంట్‌లోనూ మార్పులు జరిగాయి. ఈమేరకు ఎంఓఆర్‌టీహెచ్ డైరెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ జాతీయ రహదారిని ముద్దనూరు, పులివెందుల, అనంతపురం జిల్లా కదిరి, ఓడిచెరువు, గోరంట్ల, పాలసముద్రం నుంచి హిందూపురం వరకు నిర్మించనున్నారు. అక్కడే జాతీయ రహదారి 544ఈతో దీన్ని అనుసంధానం చేస్తారు.