దళితులెందుకు బాధ పడతారు?

ABN , First Publish Date - 2021-11-02T07:47:42+05:30 IST

నకు పదవి దక్కినప్పుడు... అది దళితులందరికీ దక్కిన గౌరవం! పదవి నుంచి తప్పించినప్పుడు మాత్రం... అది తనకు మాత్రమే సంబంధించిన విషయం!

దళితులెందుకు బాధ పడతారు?

  • ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే గ్రేట్‌
  • శాఖ తొలగింపుపై నారాయణస్వామి వ్యాఖ్యలు


అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తనకు పదవి దక్కినప్పుడు... అది దళితులందరికీ దక్కిన గౌరవం! పదవి నుంచి తప్పించినప్పుడు మాత్రం... అది తనకు మాత్రమే సంబంధించిన విషయం! దళితులకు దీంతో ఎలాంటి సంబంధమూ లేదు! ఇది... ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అభిప్రాయం! ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం అతి త్వరలో మంత్రులందరినీ మార్చేయాల్సి ఉన్నప్పటికీ... హఠాత్తుగా మంత్రి నారాయణస్వామి నుంచి వాణిజ్యపన్నుల శాఖను తప్పించి, దానిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి అప్పగించారు. ఇది దళిత మంత్రికి జరిగిన అన్యాయమే అని విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై నారాయణస్వామి సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు ఏం అన్యాయం జరిగిందని దళితులంతా బాధపడతారు? మంత్రి పదవి నుంచి తప్పిస్తేనో, అవినీతిపరుడని శాఖ తీసేస్తేనో స్పందించవచ్చు. కానీ, నావద్ద ఉన్న ఒక శాఖను మరో మంత్రికి ఇస్తే దళితులంతా బాధపడతారా?’’ అని ప్రశ్నించారు.  తనకున్న పొజిషన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకే  ముఖ్యమంత్రి కుటుంబానికి రుణపడి ఉంటానని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి జగన్‌ చరిత్ర సృష్టించారని చెప్పారు.


వాణిజ్య పన్నులను ఆర్థిక శాఖ పరిధిలోకి తేవడమే సరైనదని నారాయణస్వామి తెలిపారు. ‘‘ఆర్థికశాఖ మంత్రి జీఎస్టీ కౌన్సిల్‌లో సభ్యుడు. ప్రతి సమావేశానికి ఆయనే వెళ్తుంటారు. కేంద్రం కూడా రాష్ట్రాల్లో వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రికే ఇవ్వాలని ఆదేశించింది. యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాణిజ్య పన్నుల శాఖను ఆయనకే ఇచ్చారు’’ అని గుర్తుచేశారు. జీఎస్టీ ఎప్పుడో వస్తే, ఇప్పుడు శాఖ ఎందుకు తొలగించారని ప్రశ్నించగా.. ఈ మఽధ్యే కేంద్రం వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా ఆర్థికశాఖ మంత్రికే ఇవ్వాలని ఆదేశాలిచ్చిందని చెప్పారు. కానీ... తెలంగాణలో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు. వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరే ఉంది. తమిళనాట ఆర్థిక శాఖను ఫళణివేల్‌ చూస్తుండగా... వాణిజ్యపన్నులను మరో మంత్రి చూస్తున్నారు. అన్నింటికంటే మించి... రెండున్నరేళ్ల తర్వాత మంత్రులందరినీ మార్చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారు. ఈ గడువు కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. అలాంటప్పుడు ఈలోపే నారాయణస్వామి నుంచి ఒక శాఖను తప్పించడం ఎందుకు?

Updated Date - 2021-11-02T07:47:42+05:30 IST