నేటి ‘ఉక్కు’ పోరాటం.. రేపటి వెలుగుకు నాంది

ABN , First Publish Date - 2021-03-14T09:22:04+05:30 IST

విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలుగు సినీ హీరో నారా రోహిత్‌ మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి పిడికిలి బిగించాలని తెలుగు ప్రజలకు శనివారం ఆయన

నేటి ‘ఉక్కు’ పోరాటం.. రేపటి వెలుగుకు నాంది

ఇది తెలుగువారి అస్తిత్వానికి ప్రతీక 

‘విశాఖ’ ఉద్యమానికి నారా రోహిత్‌ మద్దతు


అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలుగు సినీ హీరో నారా రోహిత్‌ మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి పిడికిలి బిగించాలని తెలుగు ప్రజలకు శనివారం ఆయన తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో విజ్ఞప్తి చేశారు. త్వరలోనే విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు తెలుపుతానని వెల్లడించారు. ‘‘నేటి విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలి. నేటి ఉద్యమ స్ఫూర్తి రేపటి ప్రగతికి బాట వేయాలి. విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ. ఈ తరానికి... రాబోయే తరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపే కన్నతల్లి. ఉక్కు పోరాటంలో నన్ను భాగస్వామిని చేసిన కార్మిక లోకానికి వందనం. తెలుగువారి అస్థిత్వానికి ఈ ఉద్యమం ఒక ప్రతీక. దానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు వెన్ను చూపడం నా నైజం కాదు.


సాటి ఆంధ్రుడికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడతా. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కుంగదీసే దాడి జరుగుతోంది. యువతా... మేలుకో. నీ పోరాట పటిమతో నవయుగ చైతన్యానికి నాంది పలుకు. త్యాగధనుల పోరాట ఫలం పరాధీనం కాకుండా పిడికిలి బిగించు. తెలుగువారి స్వాభిమానం అపహాస్యం అవకుండా ఐక్య పోరాటానికి కదలిరా’’ అని నారా రోహిత్‌ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-03-14T09:22:04+05:30 IST