పోరాటం మాది... పాలాభిషేకాలు మీవా!

ABN , First Publish Date - 2021-08-27T08:21:29+05:30 IST

‘‘అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం అందగానే ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యేలు ఇన్ని రోజులు ఎక్కడున్నారు? పోరాటంలో..

పోరాటం మాది... పాలాభిషేకాలు మీవా!

వైసీపీ ఎమ్మెల్యేలపై ముప్పాళ్ల ఫైర్‌

కొత్త పేరుతో అగ్రిగోల్డ్‌ మరో మోసానికి తెరతీసింది

ప్రభుత్వం నిరంతరం నిఘా పెట్టాలని విజ్ఞప్తి

ఒంగోలు జడ్పీ, ఆగస్టు 26: ‘‘అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం అందగానే ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యేలు ఇన్ని రోజులు ఎక్కడున్నారు? పోరాటంలో వారు కూడా కలిసి వచ్చినట్లయితే ఈ సహాయం పొందడానికి 27 నెలలు పట్టేది కాదు. జాప్యానికి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి’’ అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఒంగోలులో గురువారం అగ్రిగోల్డ్‌ బాధితుల పరిహారంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అలుపెరగకుండా చేసిన ఉద్యమాల మూలంగానే రాష్ట్రంలో 10,40,370 మందికి డిపాజిట్‌ రాబట్టగలిగామన్నారు. ఇంకా 3.40 లక్షల మందికి రూ.20 వేల లోపు డిపాజిట్లు ఇవ్వాల్సి ఉందని, వారి విషయంలో కూడా సీఎం సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు.


అగ్రిగోల్డ్‌ మరో కొత్త కంపెనీ పేరుతో ఇంకోసారి మోసానికి తెరలేపిందని, ప్రభుత్వం వారి కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టాలని ముప్పాళ్ళ కోరారు. అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు మాట్లాడుతూ నాటి ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్‌గ్రేషియాను మించి రూ.10 లక్షలు ఇస్తానని సీఎం జగన్మోహన్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఆ విషయంపై నోరు మెదకపోవడం సరైన విధానం కాదన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలకు, అసహజ మరణాలకు గురైన అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమావేశం అనంతరం జిల్లాలో ఉన్న అగ్రిగోల్డ్‌ బాధితులు, వారి పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ నాయకులను సన్మానించారు. 

Updated Date - 2021-08-27T08:21:29+05:30 IST