నడవలేక కూర్చున్న ఎంపీ

ABN , First Publish Date - 2021-05-18T08:07:35+05:30 IST

ఎంపీ రఘురామకృష్ణంరాజును రాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్కార్ట్‌ వాహనం దిగి మిలిటరీ అంబులెన్స్‌లో...

నడవలేక కూర్చున్న ఎంపీ

  • సహకరించి ఆర్మీ ఆస్పత్రిలోకి తీసుకెళ్లిన మిలిటరీ అధికారులు
  • అప్పటికే అక్కడకు కుటుంబ సభ్యులు.. ధైర్యం చెప్పిన రఘురామ
  • ఏపీలో తనకు ప్రాణహాని ఉందని మీడియాకు వెల్లడి

హైదరాబాద్‌ సిటీ/తిరుమలగిరి, మే 17 (ఆంధ్రజ్యోతి): ఎంపీ రఘురామకృష్ణంరాజును రాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్కార్ట్‌ వాహనం దిగి మిలిటరీ అంబులెన్స్‌లో ఎక్కే సమయంలో  నడవలేక ఆయన ఇబ్బంది పడ్డారు. అక్కడే కూర్చుండి పోయారు. ఆర్మీ ఆఽధికారులు సహకరించి ఆయనను అంబులెన్స్‌లో ఎక్కేందుకు సహకరించారు. అప్పటికే ఎంపీ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొన్నారు. సీఐడీ అధికారుల అనుమతితో వారు ఆయనతో మాట్లాడారు. న్యాయం గెలుస్తుంది.. ధైర్యంగా ఉండండంటూ ఈ సమయంలో కుటుంబ సభ్యులకు రఘురామ భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న మీడియాతో రఘురామ మాట్లాడే ప్రయత్నం చేయగా.. అధికారులు అనుమతించలేదు. దీంతో ఏపీలో తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని మాత్రమే ఆయన  వెల్లడించారు. ఏపీ సీఐడీ అధికారులు తనను కొట్టారని పలుమార్లు కోర్టుకు విన్నవించుకోవడంతో సికింద్రాబాధ్‌ మిలటరీ ఆస్పత్రికితరలించి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు బెంచ్‌ ఆదేశాలు చేసిందని తెలిపారు. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో ఆర్మీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యనిపుణుల బృందం ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహిస్తుందని ఆర్మీ అధికారులు సోమవారం రాత్రి ఓప్రకటనలో తెలిపారు. వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో వీడియో తీసి కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. కాగా, ఏపీ నుంచి వచ్చిన ఎంపీ అభిమానులు ఆర్మీ ఆస్పత్రి వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఆర్మీ ఆస్పత్రి ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 


Updated Date - 2021-05-18T08:07:35+05:30 IST