ఉద్యమం@ 400

ABN , First Publish Date - 2021-01-21T09:18:05+05:30 IST

అమరావతి ఉద్యమ నినాదం రాజధాని గ్రామాల్లో మార్మోగింది. ‘ఒకటే రాష్ట్రం-ఒకటే రాజధాని’

ఉద్యమం@ 400

  • మార్మోగిన అమరావతి నినాదం
  • ‘సంకల్ప ర్యాలీ’తో ఐక్యత చాటిన రైతులు
  • కూలీలు..ట్రాక్టర్‌ నడిపి రైతులకు గల్లా మద్దతు 


గుంటూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): అమరావతి ఉద్యమ నినాదం రాజధాని గ్రామాల్లో మార్మోగింది. ‘ఒకటే రాష్ట్రం-ఒకటే రాజధాని’ నినాదంతో అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు చేస్తున్న ఆందోళనలు బుధవారానికి 400వ రోజుకు చేరాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమరావతి పరిరక్షణ జేఏసీ నేతల నేతృత్వంలో ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీ జరిగింది. ‘అమరావతి సంకల్ప ర్యాలీ’ పేరిట జరిగిన ఈ ర్యాలీ తుళ్లూరులో ప్రారంభమై పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్లమాను, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి మీదగా మందడం వరకు సాగింది. ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లతో రైతులు, రైతు కూలీలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని తమ ఐక్యత చాటారు. ఢిల్లీ రైతుల నిరసన దీక్షల స్ఫూర్తితో వందల సంఖ్యలో ట్రాక్టర్లతో అమరావతి రైతులు కదం తొక్కారు.


ర్యాలీకి ఘనస్వాగతం..

‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’, ‘జై అమరావతి’ నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. ఉద్యమ గీతాలతో రాజధానివాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ఆయా గ్రామాలకు చేరుకున్నప్పుడు గ్రామ పరిధిలో పాదయత్ర నిర్వహించారు. అన్ని గ్రామాల్లోనూ రైతులు, మహిళలు, యువత, చిన్నారులు భారీ ఎత్తున తరలివచ్చి ర్యాలీకి ఘనస్వాగతం పలికారు. అమరావతి జేఏసీ రూపొందించిన ఆకుపచ్చని జెండా, మరో చేత జాతీయ జెండాను పట్టుకొని రైతులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం 4.30 వరకు సాగింది. తమ పోరాటాన్ని ప్రభుత్వం అవహేళన చేసినా మొక్కవొని దీక్షతో ముందుకు సాగి అమరావతిని కాపాడుకుంటామని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. అమరావతి పోరాటం కేవలం రాజధానివాసులే కాకుండా రాష్ట్రం ప్రజలంతా కలిసి రావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఇతర ప్రాంతాల్లోనూ ఉద్యమం విస్తరించేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 


మద్దతు తెలిపిన పార్టీలు, ప్రజా సంఘాలు

రాజధాని రైతులకు పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. రైతులు 400 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడంలేదంటూ ధ్వజమెత్తారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో ప్రభుత్వం పెట్టిన కేసులు హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతించారు. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని నాయకులు వ్యాఖ్యానించారు


ట్రాక్టర్‌ నడిపిన గల్లా

అమరావతి సంకల్ప ర్యాలీలో ఎంపీ జయదేవ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ర్యాలీని ముందుండి నడిపించిన నాయకుల్లో గల్లా ప్రముఖంగా ఆకర్షించారు. తలకు పాగా చుట్టుకుని ట్రాక్టర్‌ నడుపుతూ.. రైతులను ఉత్సాహపరిచారు. కొంత దూరం బుల్లెట్‌ నడిపారు. అదేవిధంగా కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ టూవీలర్‌ను స్వయంగా నడుపుతూ.. మహిళలను ఉత్సాహ పరిచారు. 


అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

‘అమరావతి సంకల్ప ర్యాలీ’ రాయపూడి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్దకు చేరుకోగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లింగాయపాలెం వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపైకి అనుమతి లేదంటూ.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రైతులకు సర్దిచెప్పి ఉద్దండరాయునిపాలెం వెళ్లండంటూ లింగాయపాలెం వరకు అనుమతించారు. 

Updated Date - 2021-01-21T09:18:05+05:30 IST