దానిమ్మ చెట్టుకు డబ్బు కాయలు

ABN , First Publish Date - 2021-07-08T07:57:48+05:30 IST

సోమశిల-కండలేరు భూపరిహారం వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. విచారణ పూర్తయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే విషయంలో రెవెన్యూ శాఖ ఊహకందని చిత్ర విచిత్రాలు ప్రదర్శిస్తోంది

దానిమ్మ చెట్టుకు డబ్బు కాయలు

కోర్టు చెప్పింది 2 వేలు.. అధికారులు ఇస్తున్నది 14 వేలు

‘సోమశిల’లో చెట్లకు కోట్లలో లెక్కింపు

40 ఏళ్ల వివాదంలో మరో వింత చిక్కు

2వేలు పరిహారం నిర్ణయించిన హైకోర్టు

చెల్లింపునకు ఈనెల 13 వరకు గడువు

జిల్లాస్థాయిలో మారిపోయిన లెక్కలు

చెట్టుకు రూ.14 వేల పరిహారం నిర్ణయం

అవసరంలేకున్నా 1992 నుంచి వడ్డీ

70 లక్షల పరిహారం 5 కోట్లకు చేరిక

కింది నుంచి వచ్చిన నివేదికలను కళ్లుమూసుకుని ఆమోదించిన వైనం


అప్పుడెప్పుడో... ఒక్కో దానిమ్మ చెట్టుకు పరిహారంగా 30 రూపాయలు చెల్లించారు. అది సరిపోదు... చెట్టుకు రూ.2 వేలు చెల్లించాలని ఇప్పుడు కోర్టు చెప్పింది. అంటే... ఒక్కో చెట్టుకు ఇంకో రూ.1970 చెల్లించాలి. కానీ... అధికారులు దానిమ్మ చెట్లకు ‘కాసులు’ కాయించారు. ఒక్కో చెట్టుకు రూ. 14 వేలు ఇవ్వాలని తేల్చేశారు. అసలే.. 40 ఏళ్లుగా వివాదంలో నలుగుతూ, న్యాయ చిక్కుల నుంచి ఇటీవలే సోమశిల- కండలేరు పరిహార సమస్య కొలిక్కి వచ్చింది. అందులోనే ఈ లెక్కల గోల్‌మాల్‌!


పోలవరం చెట్లకు ఎంతో..?

సోమశిల-కండలేరులో కేవలం 3543 దానిమ్మ చెట్లకే రూ.5 కోట్లు చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ లెక్కన విస్తీర్ణంలో ‘బాహుబలి’ అయిన పోలవరం ప్రాజెక్టు పరిధిలో జరిపిన భూ సమీకరణ సందర్భంగా అందులో గుర్తించిన చెట్లకు పరిహారం ఇవ్వాలంటే ఎన్ని వందల కోట్లవుతుందోనని రెవెన్యూ వర్గాలే విస్మయం చెందుతున్నాయి.


(అమరావతి- ఆంధ్రజ్యోతి)

సోమశిల-కండలేరు భూపరిహారం వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. విచారణ పూర్తయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే విషయంలో రెవెన్యూ శాఖ ఊహకందని చిత్ర విచిత్రాలు ప్రదర్శిస్తోంది. రూపాయి ఇవ్వాల్సిన చోట ఏడున్నర రూపాయలు ఇస్తామంటూ ఎక్కడా లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూశాఖ తీరు ఒకేలా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టర్లకి, సప్లయర్స్‌కి, వెండర్స్‌కి పెండింగ్‌ బిల్లులు, ఉద్యోగులకు డీఏలు ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి పనులు చేసిన వారికి, సరఫరా చేసిన వారికి కనీసం ఆ బిల్లులు పెట్టుకునే అవకాశం కల్పించకపోగా, ఆ పెండింగ్‌ బిల్లులతో తమకు సంబంధమే లేదన్నట్టు వాటికి బడ్జెట్‌ కూడా కేటాయించడం లేదు. కానీ, ‘సోమశిల- కండలేరు’ చెట్ల పరిహారం విషయంలో మాత్రం ఎందుకింత ఉదారతో తెలియడం లేదు. 


ఆ వివరాల్లోకి వెళితే.. దాదాపు 40 ఏళ్ల క్రితం సోమశిల కండలేరు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసమీకరణ చేసింది. భూములకి, ఆ భూముల్లో ఉన్న చెట్లకు కూడా లెక్కలు కట్టి చెల్లింపులు పూర్తి చేసింది. కానీ, పరిహారం సరిపోలేదంటూ కోర్టులో దాదాపు 100 పిటిషన్లు పడ్డాయి. కింది కోర్టుల్లో పిటిషనర్లకు చుక్కెదురైనా, 2017లో హైకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. ఆ తర్వాత మరికొందరు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లారు. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోబోమంటూ సుప్రీంకోర్టు 2020లో చెప్పింది. దీంతో హైకోర్టు తీర్పే ఫైనల్‌ అయింది. హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పరిహారం ఇప్పించేందుకు రెవెన్యూ శాఖ తీవ్రంగా కసరత్తు చేసి ఒక లెక్కల పత్రాన్ని తయారుచేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఒక్కో దానిమ్మ చెట్టుకి రూ.2000 చెల్లించాలి. అందులో 1992లో రూ.30 ప్రభుత్వం చెల్లించింది. అంటే ఇంకా ఒక్కో చెట్టుకి రూ.1970 చెల్లించాలి. కానీ, నెల్లూరు జిల్లా రెవెన్యూ య ంత్రాంగం నుంచి రాష్ట్ర స్థాయిలో సీసీఎల్‌ఏ వరకూ అందరూ కోర్టు చెప్పిన పరిహారాన్ని దాదాపు రూ.14,378 అందేలా లెక్కలు సిద్ధంచేశారు. దీంతో 3543 చెట్లకు గాను దాదాపు రూ.70 లక్షలు చెల్లించాల్సిన పరిహారం కాస్త రూ.5.9 కోట్లకు చేరుకుంది. ఈ లెక్క కేవలం ఆరు పిటిషన్లకు సంబంధించినదే కావడం గమనార్హం. ఇలాంటి పిటిషన్లకు వంద వరకు ఉన్నాయి. 


ఇలా పెంచేశారు.. 

ఒక్కో దానిమ్మ చెట్టుకి కోర్టు చెప్పిన రూ.1970 పై రెవెన్యూ అధికారులు 30శాతం సొలాషియం, 12 శాతం అదనపు మార్కెట్‌ విలువ జోడించారు. అంటే కట్టాల్సిన మొత్తానికి ప్రాథమికంగా 42 శాతం మేర పెంచారు. ఆ వచ్చిన మొత్తంపై 1992 నుంచి ఏడాది పాటు అంటే 1993 వరకు 9 శాతం వడ్డీ రేటు, ఆ తర్వాత 1993 నుంచి 2020 వరకు 15 శాతం వడ్డీని అమలు చేశారు. అంటే మొత్తం 3,543 చెట్లకు (ఆరుగురు పిటిషనర్లు) చెల్లించాల్సిన రూ.69,79,710కి సొలాషియం, అదనపు మార్కెట్‌ విలువ రూపంలో 42 శాతం జోడిస్తే అది రూ.99,11,188కి చేరుకుంది. దీనిపై ఏడాది పాటు 9శాతం వడ్డీ అంటే రూ.8,92,006, తర్వాత 2020 వరకు 15 శాతం వడ్డీ అంటే రూ.4,01,40,311కి చేరుకుంది. అంటే కోర్టు చెప్పిన అసలు, సొలాషియం, అదనపు మార్కెట్‌ విలువ, రెండు రకాల వడ్డీలు కలుపుకుని మొత్తం పరిహారం రూ.5,09,43,505కి పెరిగింది. ఈ మొత్తాన్ని పరిహారం రూపంలో ఇవ్వాలంటూ జిల్లా రెవెన్యూ యంత్రాంగం నుంచి వచ్చిన లెక్కల పత్రాన్ని ఎలాంటి సవరణలు లేకుండా సీసీఎల్‌ఏ ఆమోదించారని తెలుస్తోంది. అయితే, రెవెన్యూతో పాటు ఈ చెల్లింపులకు న్యాయశాఖ, జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ ఆమోదాలు కూడా తప్పనిసరి. ప్రస్తుతం సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి ఈ ఫైలు అభిప్రాయం కోసం న్యాయశాఖకు చేరినట్టు తెలుస్తోంది. 


అన్ని కళ్లు దాటుకొని..

పరిహారం వ్యవహారం రెవెన్యూ, జలవనరుల శాఖ, న్యాయ, ఆర్థిక శాఖల పరిధిలోని అంశం. కానీ ఏ ఒక్క శాఖలో అధికారి కూడా ఈ లెక్కల భారీతనాన్ని సీరియ్‌సగా తీసుకోకపోవడం గమనార్హం. సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన లెక్కలను కనీసం ప్రశ్నించడం కూడా లేదు. న్యాయశాఖ ఏదైనా అభ్యంతర పెడితే దాని ప్రకారం ఆ ఫైలుకి రెవెన్యూ అధికారులు.. సవరణలు చేయాలి. అలాగే, ప్రాజెక్టు జలవనరుల శాఖకు సంబంధించినది కాబట్టి ఆ శాఖ అధికారులు అయినా అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. డబ్బులు చెల్లించాల్సింది ఆర్థిక శాఖ. ఈ లెక్కలను ఆ శాఖ ప్రశ్నించవచ్చు. అయితే, ఏదశలో కూడా ఆ బోగస్‌ లెక్కలను ఎవరూ వ్యతిరేకించినట్టు కనపడడం లేదు. ఎందుకంటే సీసీఎల్‌ఏ నుంచి సెక్రటేరియట్‌కి వెళ్లిన ఫైలు సవరణల కోసం ఇంకా సీసీఎల్‌ఏకి తిరిగి రాలేదు. మరోవైపు చెల్లింపునకు గడువు దగ్గరపడుతుండడంతో సచివాలయంలో ఏ స్థాయిలోనూ ఆ ఫైలుని ఎవరూ ప్రశ్నించినట్టు లేదని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.


గడువు ఉండగానే వడ్డీలా?

కోర్టు మొత్తం కలిపి చెట్టుకి రూ.2,000 పరిహారం చెల్లించాలని చెప్పింది. పరిహారం లో ఎప్పుడూ వడ్డీ అనేది ఉండదు. ఒకవేళ చెల్లించాల్సిన సమయానికి చెల్లించలేకపోయిన పక్షంలో మాత్రమే వడ్డీ రేట్లు లాంటివి తెరపైకి వస్తాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు 2020లో వచ్చాయి. హైకోర్టు తీర్పు ప్రకారం వాటి చెల్లింపులకు ఈ నెల 13వతేదీ వరకు సమయం ఉంది. గడువు ముగియకపోయినప్పటికీ కూడా రెవెన్యూ శాఖ 1992 నుంచి ఎందుకు వడ్డీరేటు అమలు చేసిందనేది అర్థం కాని విషయం. వాటిని యథాతథంగా సీసీఎల్‌ఏ ఎందుకు ఆమోదించారనేది ప్రశ్నార్థకం. ఒకవేళ 2017లో హైకోర్టు ఇచ్చిన తీర్పునే పరిగణనలోకి తీసుకుంటే అప్పటి నుంచి మాత్రమే వడ్డీ లెక్కించాల్సింది. కానీ, రెవెన్యూ శాఖ చేసిన ఈ పని ఎలాంటి లాజిక్‌లకు అందడం లేదు. 


పరిహారం చెల్లింపుల్లో వివక్ష తగదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకే భూసేకరణ నోటిఫికేషన్‌లో ఉన్న అందరికీ ఒకే రకంగా పరిహారం చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో తెలుగు గంగా ప్రాజెక్టులో భాగంగా ‘సోమశిల-కండలేరు’లో 1990ల్లో సేకరించిన భూముల్లో ఉన్న దానిమ్మ చెట్లకుగాను నిర్వాసితులకు వేర్వేరు మొత్తాల్లో పరిహారం చెల్లించడాన్ని సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లు బుధవారం సుప్రీంకోర్టు ఎదుట విచారణకు వచ్చాయి. జస్టిస్‌ ఏ ఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి... పిటిషనర్లకు సానుకూలంగా తీర్పును వెలువరించింది.  

Updated Date - 2021-07-08T07:57:48+05:30 IST