టీడీపీ మాక్ అసెంబ్లీపై మంత్రి పేర్ని నాని సెటైర్లు

ABN , First Publish Date - 2021-05-21T00:12:59+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ..

టీడీపీ మాక్ అసెంబ్లీపై మంత్రి పేర్ని నాని సెటైర్లు

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ.. ప్రజా సమస్యలపై చర్చకు గురువారం నుంచి రెండు రోజులపాటు సమాంతర అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. అనంతరం తీర్మానాలు చేసి స్పీకర్‌కు టీడీఎల్పీ పంపనుంది. మాక్ అసెంబ్లీని నిర్వహిస్తోన్న టీడీపీ.. సురభి డ్రామా కంపెనీని గుర్తు చేస్తోందని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ మాక్ అసెంబ్లీపై మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని సెటైర్ల వర్షం కురిపించారు.


మహానటులు కనిపిస్తున్నారు!

టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహానటులు కనిపిస్తున్నారు. ఎస్వీఆర్, నాగభూషణం, సావిత్రి వంటి నటులు మాక్ అసెంబ్లీలో కనిపిస్తున్నారు. టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి తమకు వినోదాన్ని పంచేందుకు మరో డ్రామా కంపెనీ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. గ్లోబల్ టెండర్లల్లో తప్పులుంటే టీకా ఉత్పత్తి కంపెనీలు చెప్పాలి.. అంతేకానీ చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. టీకా ఉత్పత్తి కంపెనీల్లో చంద్రబాబుకు ఏమైనా వాటాలున్నాయా..?. గ్లోబల్ టెండర్లల్లో పాల్గొనేందుకు టీకా కంపెనీలు సిద్దంగా ఉంటే చంద్రబాబుకొచ్చిన ఇబ్బందేమిటీ..? అని బాబుపై మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు.


అన్నీ సిద్ధం చేస్తున్నాం..!

బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశాం. సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి మరీ ప్రజలకు సంక్షేమం అమలు చేస్తున్నాం. తొలిసారి జెండర్ బడ్జెట్, పిల్లల బడ్జెట్, మైనార్టీల బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ తరహాలో జెండర్, పిల్లలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాం. కాపు నేస్తం పథకాన్ని చెప్పిన దానికంటే మిన్నగా అమలు చేస్తున్నాం. అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బంది లేకుండా ఆహార భద్రత కల్పిస్తున్నాం. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మేం తీరుస్తున్నాం. రూ. 31 వేల కోట్లతో ఆస్తుల కల్పనకు నిర్ణయించాం అని పేర్ని నాని మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-05-21T00:12:59+05:30 IST