మంత్రి అవంతిపై ఆడియో కలకలం

ABN , First Publish Date - 2021-08-20T07:39:16+05:30 IST

రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చెందినదంటూ గురువారం సోషల్‌ మీడియాలో ఓ ఆడియో వైరల్‌ అయింది.

మంత్రి అవంతిపై ఆడియో కలకలం

గిట్టని వ్యక్తుల పనేనన్న ముత్తంశెట్టి

అందులోని వాయిస్‌ తనది కాదని ఖండన


విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చెందినదంటూ గురువారం సోషల్‌ మీడియాలో ఓ ఆడియో వైరల్‌ అయింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఆ ఆడియోలో వాయిస్‌ తనది కాదని మంత్రి ఖండించారు. తన రాజకీయ ఎదుగుదల చూసి గిట్టనివారు చేసిన పనిగా ఆరోపించారు. ఆడియో వైరల్‌ కావడంతో మంత్రి హుటాహుటిన రాత్రి పది గంటలకు సీతమ్మధారలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. తాను ఒక బ్యాక్‌గ్రౌండ్‌, స్టేచర్‌ ఏర్పాటుచేసుకున్న తర్వాత ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఎమ్మెల్యేగా, ఎంపీగా, తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి స్థాయికి వచ్చానని.. ఓటమి లేకుండా ఎదగడం కొంతమందికి ఇబ్బందిగా మారి ఉంటుందన్నారు. తన రాజకీయ జీవితంలో భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఒక్క ఆరోపణ కూడా రాకపోవడం తన నిజాయితీకి నిదర్శనమని చెప్పారు. తాను దేవుడిని నమ్ముతానని, పది మందికి సాయం చేయాలనుకుంటాను తప్ప.. ప్రత్యర్థులకు కూడా హాని తలపెట్టకపోవడం తన నైజమన్నారు.


ప్రస్తుతం రాజకీయాలు చాలా దిగజారిపోయాయని, ఎదుటివారిని దెబ్బకొట్టేందుకు ఎంతకైనా తెగించేస్తున్నారని ఆవేదన వ్యక్తంచే శారు. మహిళలకు సీఎం జగన్‌ అన్ని రకాలుగా ప్రాఽధాన్యం ఇస్తుండడంతో వారు పార్టీ పట్ల ఆదరణ చూపుతున్నారని, వారిని దూరం చేయాలంటే ఇలాంటి ఎత్తులనే ఎంచుకోవాలని కొంతమంది ఆలోచిస్తున్నారని ఆరోపించారు. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తానని, అది నచ్చనివారు ఇలా చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. తాజా ఘటన తనతోపాటు, తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకూ చాలా బాధ కలిగించిందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదుచేశానని, విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి స్పష్టత ఇచ్చానని తెలిపారు. దేనికైనా కాలమే సమాఽధానం చెబుతుందని, పోలీసుల దర్యాప్తులో వాస్తవాలేమిటో బయటకు వస్తాయన్నారు. కాగా.. ఈ అంశంపై  మంత్రి విశాఖ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-08-20T07:39:16+05:30 IST