మైనింగ్‌ మాయ

ABN , First Publish Date - 2021-02-01T08:28:49+05:30 IST

అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారంటూ గురు రాఘవేంద్ర ఇన్‌ఫ్రా సంస్థకు ఇటీవల రూ.18.88 కోట్లు జరిమానా విధించారు.

మైనింగ్‌ మాయ

  • అక్రమ తవ్వకాలకి పాత క్వారీ 
  • పేరుతో రాయల్టీ బిల్లులు 
  • సీఎంకి ఫిర్యాదు చేయడంతో ఆదరాబాదరాగా విచారణ
  • 18.88 కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఒకే సంస్థ పేరిట ఇద్దరికి నోటీసులు

శ్రీకాళహస్తి, జనవరి 31: అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారంటూ గురు రాఘవేంద్ర ఇన్‌ఫ్రా సంస్థకు ఇటీవల రూ.18.88 కోట్లు జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని 15 రోజుల్లో చెల్లించాలంటూ ఏవీ రమణయ్యకు మైనింగ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. తనకు సంబంధంలేని క్వారీకి జరిమానా ఎందుకు చెల్లించాలని ఆయన నిలదీయడంతో.. వెంకటకృష్ణారెడ్డి పేరిట మరోసారి నోటీసులిచ్చారు. ఎవరో ఒకరు జరిమానా కట్టాలంటున్నారు. వివరాల్లోకి వెళితే...చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం రౌతుసూరమాల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 1 లో రెండు హెక్లార్లలో క్వారీ తవ్వుకోవడానికి ఏవీ రమణయ్యకు మైనింగ్‌ అధికారులు అనుమతిచ్చారు. గురు రాఘవేంద్ర ఇన్‌ఫ్రా పేరిట పనులు చేపట్టిన ఆయన పదేళ్ల కిందటే దానిని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వెంకటకృష్ణారెడ్డికి విక్రయించారు. సుమారు నాలుగేళ్లుగా దీనిలో మైనింగ్‌ జరగడం లేదు. అయితే ఇదే పేరుతో మరో క్వారీ కోసం వెంకటకృష్ణారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి గుమ్మడిగుంట పరిధిలోని బ్లాక్‌ నెంబరు 27లో నాలుగు హెక్టార్లను తొట్టంబేడు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు.


 క్వారీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని 2018 ఏప్రిల్‌ 24న మైనింగ్‌ శాఖ అధికారులకు లేఖ రాశారు. ఇప్పటికీ వారి నుంచి అనుమతి రాలేదు. అయినప్పటికీ అక్కడ వెంకటకృష్ణారెడ్డి అనధికారికంగా మైనింగ్‌ పనులు చేపట్టేశారు. ఇది అటు రెవెన్యూ, ఇటు మైనింగ్‌ అధికారులకూ తెలిసిన సత్యమే. ఈ రెండేళ్లలో 1,85,334 క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలు జరిగాయి. దీనికి అనుమతి లేకపోవడంతో మైనింగ్‌ అధికారులు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. రౌతుసూరమాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1లోని గురు రాఘవేంద్ర ఇన్‌ఫ్రా పేరుతో రాయల్టీ బిల్లులు ఇస్తూ వచ్చారు. అయితే ఈ అక్రమ క్వారీల నిర్వహణపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. దీనితో అనుమతులు లేకుండా తవ్వినందుకు రూ.18 కోట్ల 88 లక్షల 18వేల 279 జరిమానా చెల్లించాలంటూ గురు రాఘవేంద్ర ఇన్‌ఫ్రా పూర్వ నిర్వాహకుడు ఏవీ రమణయ్య పేరిట నోటీసులు జారీ చేశారు. దీనిపై అధికారులను నిలేసిన ఆయన న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఇదే సమస్యపై కొందరు సీఎంకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. విషయం తెలిసి మైనింగ్‌ అధికారులు ఆగమేఘాలపై వెంకటకృష్ణారెడ్డికి నోటీసులిచ్చారు.


ఎవరో ఒకరు కడితే సరి 

గురు రాఘవేంద్ర ఇన్‌ఫ్రా వారు అనుమతి లేకుండానే మైనింగ్‌ తవ్వకాలు చేస్తున్నట్లు మా విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో మొదట ఏవీ రమణయ్యకు నోటీసులు జారీ చేశాం. ఇది సమస్యగా మారడంతో మళ్లీ వెంకటకృష్ణారెడ్డికి నోటీసులిచ్చాం. వారిలో ఒకరు కడితే చాలు.   

 - అశోక్‌, ఏడీ, మైనింగ్‌ శాఖ

Updated Date - 2021-02-01T08:28:49+05:30 IST