గనుల సీనరేజీ, ఫీజుల వసూళ్లు ప్రైవేటుకు

ABN , First Publish Date - 2021-10-21T11:06:47+05:30 IST

రాష్ట్రంలో ఖనిజాల తవ్వకాలపై ఫీజుల వసూళ్లను ప్రైవేటుకు అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇటీవల చిన్న తరహా ఖనిజాల తవ్వకాలపై సవరించిన సీనరేజీ, పరిశీలన ఫీజులను ఇకపై ప్రైవేటు సంస్థల ద్వారా వసూలు చేయించనున్నారు.

గనుల సీనరేజీ, ఫీజుల వసూళ్లు ప్రైవేటుకు

మొత్తం రిజర్వ్‌ ధర 5,882 కోట్లుగా నిర్ణయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖనిజాల తవ్వకాలపై ఫీజుల వసూళ్లను ప్రైవేటుకు అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇటీవల చిన్న తరహా ఖనిజాల తవ్వకాలపై సవరించిన సీనరేజీ, పరిశీలన ఫీజులను ఇకపై ప్రైవేటు సంస్థల ద్వారా వసూలు చేయించనున్నారు. ఇప్పటి వరకు గనులు దక్కించుకున్నవారు నేరుగా ఆ ఫీజులు సర్కారుకే చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియను ప్రైవేటుపరం చేశారు. అంటే, సర్కారు నిర్ణయించిన రిజర్వ్‌ ధరను ప్రైవేటు సంస్థలు చెల్లించి టెండర్‌ దక్కించుకుంటాయి. ఇక అవి సీనరేజీ, కన్సిడరేషన్‌ ఫీజును వసూలు చేస్తాయి. ప్రస్తుతం ఇసుక తవ్వకాల బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మైనర్‌ మినరల్స్‌ ఫీజుల వసూళ్లను కూడా ప్రైవేటుకు అప్పగించనున్నారు. ఈ పనికోసం గనుల శాఖ రాష్ట్రంలోని 13 జిల్లాలను 6 ప్యాకేజీలుగా విభజించింది. ఆరు ప్యాకేజీల్లో కలిపి రూ.5,880 కోట్లను రిజర్వ్‌ ధరగా ప్రకటిస్తూ టెండర్లు పిలవనుంది. ఈ మేరకు గనుల శాఖ ఆరు ప్యాకేజీల టెండర్‌ డాక్యుమెంట్లను రాష్ట్ర న్యాయ కమిషన్‌ ఆమోదం కోసం పంపించింది. ఈనెల 27లోగా  న్యాయకమిషన్‌కు సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా అందించాలని గనులశాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. న్యాయకమిషన్‌ ఆమోదించాక టెండర్లు నిర్వహిస్తారు. గనులపై ఆదాయాన్ని పెంచుకునేందుకు సీనరేజీతోపాటు కన్సిడరేషన్‌ ఫీజులను పెంచుతూ ఇటీవల గనుల శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే, ఫీజుల వసూళ్లను శాఖాపరంగా కాకుండా ప్రైవేటు ఏజెన్సీల ద్వారా చేయించాలనుకున్నారు. ఇదే విషయాన్ని గంపగుత్తగా ప్రైవేటుకు ఇవ్వబోతున్నారని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. 


రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్యాకేజీలు

రాష్ట్రంలోని 13 జిల్లాలను ఆరు ప్యాకేజీలుగా ఖరారు చేశారు. ప్యాకేజీ-1లో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయి. ఈ ప్యాకేజీ రిజర్వ్‌ ధర రూ.1056 కోట్లు. ప్యాకేజీ-2లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఉన్నాయి. దీని రిజర్వ్‌ ధర రూ.485 కోట్లు. ప్యాకేజీ-3లో కృష్ణా-గుంటూరు జిల్లాలున్నాయి. ప్యాకేజీ రిజర్వ్‌ ధర రూ.944 కోట్లు. ప్యాకేజీ-4లో ప్రకాశం జిల్లా ఒక్కటే ఉంది. దీని రిజర్వ్‌ ధర రూ.1659 కోట్లు. ప్యాకేజీ-5లో నెల్లూరు, చిత్తూరు జిల్లాలున్నాయి. ఈ ప్యాకేజీ రిజర్వ్‌ ధర రూ.862 కోట్లు. ప్యాకేజీ-6లో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలున్నాయి. దీని రిజర్వ్‌ ధర రూ.876 కోట్లుగా నిర్ణయించారు. ఈ ఆరు ప్యాకేజీల మొత్తం రిజర్వ్‌ ధర 5,882 కోట్ల రూపాయలు. 


ప్రైవేటుకు బీచ్‌ శాండ్‌ ప్రాసెస్‌

శ్రీకాకుళం జిల్లాలోని బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రాసెస్‌ను కూడా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఈ-ఆక్షన్‌ విధానంలో ప్రైవేటు ఏజెన్సీని అప్పగించేందుకు గనుల శాఖ డాక్యుమెంట్‌ను రూపొందించి న్యాయ కమిషన్‌ ఆమోదం కోసం పంపించింది. ఈ అంశంపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలను న్యాయ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని గనుల శాఖ కోరింది.

Updated Date - 2021-10-21T11:06:47+05:30 IST