ఉద్యోగులతో మైండ్‌ గేమ్‌!

ABN , First Publish Date - 2021-12-31T08:04:06+05:30 IST

ఉద్యోగులతో మైండ్‌ గేమ్‌!

ఉద్యోగులతో మైండ్‌ గేమ్‌!

మీ చిత్తం అని ఉద్యోగులతో అనిపించే ఎత్తు

పీఆర్సీ చర్చల తీరుపై ఉద్యోగవర్గాల్లో చర్చ


పీఆర్సీపై ఉద్యోగులతో జగన్‌ ప్రభుత్వం మైండ్‌ గేడ్‌ ఆడుతోందా? చర్చలు, భేటీల పేరుతో కాలయాపన చేస్తుందా? ‘ఎంతిస్తే అంతివ్వండి మహా ప్రభో..’ అని ఉద్యోగుల నోటితోనే అనిపించాలని ఎత్తు వేసిందా?... అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవునని అనక తప్పడం లేదు. ‘పీఆర్సీపై మాట్లాడుకుందాం రండి’ అని పదేపదే పిలవడం.. ఆహ్వానం అందుకుని వెళ్లిన నేతలను ‘ఇక మీరు చెప్పుకోండి..వినిపెడతాం’ అంటూ మౌనంగా వినేసి వెళ్లిపోతున్న అధికారుల తీరు తమకు అవమానించేలా ఉన్నదని ఉద్యోగులు రగిలిపోతున్నారు. పలు దఫాలుగా చర్యల పేరుతో పిలుస్తూ 2021ని సర్కారు దిగ్విజయంగా కాలగర్భంలో కలిపేసిందని మండిపడుతున్నారు. పీఆర్సీపై అశుతోశ్‌మిశ్రా కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఇవ్వడంలోనూ, ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేయడంలోనూ ఇన్నాళ్లుగా ఆడుతున్న దాగుడుమూతలనే గురువారం  ఉద్యోగ సంఘాలనేతలతో జరిపిన సంప్రదింపుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింది. 11వ వేతన సవరణ సంఘం సిఫారసుల నివేదికను నేటికీ ఉద్యోగులకు ఇవ్వలేదు. ఆ నివేదిక సంగతి పక్కనబెట్టేసి...14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని అధికారుల కమిటీ సిఫారసు చేసిందంటూ కొత్తడ్రామాలకు తెరతీసింది. ఈ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పటినుంచి.. సీఎస్‌, సీఎం, ఆర్థికశాఖ అధికారులతో పీఆర్సీపై చర్చలంటూ కాలయాపన చేస్తూనే ఉన్నారు. 


కొద్దిరోజుల్లోనే పీఆర్సీ ప్రకటన

ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి

కొద్ది రోజుల్లోనే పీఆర్సీ అంశానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలుకుతుందని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమావేశంలో ఉద్యోగ సంఘాలకు వివరించామన్నారు. కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం నుంచి పీఆర్సీపై ప్రకటన వస్తుందని, అప్పటివరకు ఆగాలని ఉద్యోగ సంఘాలను కోరారు. 

Updated Date - 2021-12-31T08:04:06+05:30 IST