‘మైక్రో ఇరిగేషన్‌’కు 1,190 కోట్లు

ABN , First Publish Date - 2021-07-08T09:03:13+05:30 IST

ఉద్యానశాఖ ద్వారా ఎట్టకేలకు ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అమలుకు రూ.1,190.11 కోట్లతో ప్రభుత్వం వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది

‘మైక్రో ఇరిగేషన్‌’కు 1,190 కోట్లు

సూక్ష్మసేద్య పరికరాలకు రాయితీలు

89 కోట్లతో పశువులకు అంబులెన్స్‌ సేవలు

ఎన్జీ రంగా అగ్రి వర్సిటీకి 339 కోట్లు విడుదల


అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఉద్యానశాఖ ద్వారా ఎట్టకేలకు ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అమలుకు రూ.1,190.11 కోట్లతో ప్రభుత్వం వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగా రైతులకు రాయితీల సరళిని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంఐపీ కింద 2021-22లో లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మసేద్యాన్ని అమలు చేయనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.360.40 కోట్లు, రాష్ట్రవాటా రూ.601.40 కోట్లు, రైతు వాటా రూ.228.25 కోట్లు, మొత్తం సబ్సిడీ రూ.961.86 కోట్లుగా నిర్ణయించారు. ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన ద్వారా పర్‌ డ్రాప్‌-మోర్‌ క్రాప్‌ లక్ష్యసాధన కోసం సూక్ష్మసేద్య పరికరాలకు రాయితీలను ప్రకటించారు. 2 హెక్టార్లలోపు సన్నకారు రైతులకు 90ు, ప్రకాశం జిల్లా, రాయలసీమల్లో ఇతర రైతులకు 2-4 హెక్టార్ల వరకు 70ు, ప్రకాశం జిల్లా మినహా కోస్తాంధ్ర రైతులకు 2-5 హెక్టార్ల వరకు 50ు, అన్ని జిల్లాల్లో ఎవరికైనా 50ు రాయితీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


వెటర్నరీ క్లినిక్‌ ప్రాజెక్టుకు ఆమోదం..

అలాగే, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సంచార పశువైద్యసేవలు అందించేందుకు మొబైల్‌ అంబులెన్స్‌ వెటర్నరీ క్లినిక్‌ ప్రాజెక్ట్‌ విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టోల్‌ఫ్రీ నంబరు 120తో పశుపోషకుల ఇంటి ముంగిట వైద్య సేవలు అందించేందుకు రూ.89.85 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నారు. ఇందులో అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.63 కోట్లు, పశువులను ఎత్తేందుకు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ వంటి సౌకర్యాలకు రూ.26.95 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 2021-22 నుంచి 2025-26 వరకు ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్‌  నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా అంబులెన్స్‌ కమిటీని నియమించింది. 


రూ.2 కోట్లతో కడక్‌నాథ్‌ పౌల్ర్టీ ప్రాజెక్ట్‌..

అలాగే, కడక్‌నాథ్‌ పౌల్ర్టీ ప్రాజెక్ట్‌ పునరుద్ధరణలో భాగంగా కడప జిల్లా ఊటుకూరులోని స్టేట్‌ పౌల్ర్టీ ఫారాన్ని ప్రోత్సహించడానికి రూ.2కోట్ల అంచనాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కడక్‌నాథ్‌ పౌల్ర్టీ ఉత్పత్తిని పెంచేందుకు ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా కడక్‌నాథ్‌ పౌల్ర్టీ హాచింగ్‌ యూనిట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుత సిబ్బందిని వినియోగించుకోవాలని జీవోలో పేర్కొంది. నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. మ త్స్యకారుల గృహ నిర్మాణాలకు సంబంధించి అదనంగా విడుదల చేసిన రూ.4.65 కోట్లను ఇతర పథకాలకు మళ్లించరాదని ఉత్తర్వు జారీ అయ్యింది. వీటితో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 2021-22 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.339.76 కోట్లు విడుదల చేసింది. వ్యవసాయ పరిశోధన, విద్య, జీతాల గ్రాంటు కింద ఈ నిధులు ఇచ్చారు.

Updated Date - 2021-07-08T09:03:13+05:30 IST