టీకాలపై ‘మెప్మా’ అవగాహన!

ABN , First Publish Date - 2021-05-30T09:29:53+05:30 IST

ఈ కొవిడ్‌ సంక్షోభ సమయంలో మెప్మా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. కరోనా వైరస్‌ బారినపడకుండా తప్పించుకోవడానికి టీకాయే దివ్య ఔషదమని జనమంతా వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దకు బారులుదీరుతున్న

టీకాలపై ‘మెప్మా’ అవగాహన!

ఒకవైపు వ్యాక్సిన్‌ కేంద్రాలకు పోటెత్తుతున్న జనం

డిమాండ్‌కు తగ్గట్టు లభ్యం కాని టీకాలు

ఇప్పుడు టీకా ఆవశ్యకతపై ప్రచారం!

ఆ పేరిట లక్షలాది రూపాయల ఖర్చు!


అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): ఈ కొవిడ్‌ సంక్షోభ సమయంలో మెప్మా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. కరోనా వైరస్‌ బారినపడకుండా తప్పించుకోవడానికి టీకాయే దివ్య ఔషదమని జనమంతా వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దకు బారులుదీరుతున్న ఈ సమయంలో టీకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆ విభాగం నిర్ణయించింది. నిజానికి జనంలో ఉన్న డిమాండ్‌ మేరకు వ్యాక్సిన్‌ అందించలేక ప్రభుత్వాలే తలలు పట్టుకునే పరిస్థితుల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మెప్మా అధికారులు రంగంలోకి దిగారు. వ్యాక్సిన్లపై ఇప్పటికే దాదాపుగా అందరిలో ఒక అవగాహన ఏర్పడిన ప్రస్తుత తరుణంలో మెప్మా చేపట్టిన ఈ కార్యక్రమం విస్మయం కలిగిస్తోంది. పట్టణ పేదల్లో ఈ వ్యాక్సిన్లను వేయించుకుంటే కలిగే ప్రయోజనాలపై ‘అవగాహన’ పెంపొందించి, వారందరూ వాటిని వేయించుకునేలా చూడాలని ఈ సంస్థ ఉన్నతాధికారులు తాజాగా సంకల్పించారు! అందుకోసం.. తమ పరిఽధిలోని స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించి, అనుకున్నదే తడవుగా ఆ దిశగా కదులుతున్నారు. అయితే.. ఇదేదో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో చేపడితే ఫలితముండేదని, కానీ, ఇప్పుడు ఈ అవాగాహన కార్యక్రమాల వల్ల లక్షలాది రూపాయలు వృథా అవడమే తప్ప మరే ప్రయోజనం ఒనగూరదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


అటు ‘స్వామికార్యం’.. ఇటు ‘స్వకార్యం’!

సాధారణంగానే మెప్మా చేపట్టే పలు కార్యక్రమాలు అటు ఆ సంస్థ ఉన్నతాధికారుల్లో కొందరి జేబులు నింపేందుకు ఉద్దేశించినవి కావడంతోపాటు వారు ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడడానికి కూడా ఉపకరించేవై ఉంటాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి వస్తే కొవిడ్‌-19 సెకెండ్‌ వేవ్‌లో తమ సంస్థ ‘క్రియాశీలకం’గా లేదన్న అభిప్రాయం మెప్మా ఉన్నతాధికారుల్లో కొందరికి కలిగింది. గతేడాది వచ్చిన తొలి దశ కరోనా సమయంలో పట్టణ ప్రజలందరికీ ప్రభుత్వం చేపట్టిన మాస్క్‌ల ఉచిత పంపిణీ కార్యక్రమంలో మెప్మా చురుగ్గా పాలుపంచుకుంది. అయితే.. ఈ ఏడాది వచ్చిన రెండవ దశలో మాత్రం అలాంటి అవకాశమేమీ ఈ సంస్థకు లభించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇంతటి కల్లోల సమయంలోనూ తామేమీ చేయనట్లు ప్రభుత్వ పెద్దలు భావించే ప్రమాదం ఉందని, అది ఉత్తరోత్తరా తమకేమైనా ఇబ్బందులు తేవచ్చునని మెప్మా ఉన్నతాధికారుల్లో కొందరు భావించారు. దీంతో.. అటు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడంతోపాటు ఇటు తమకూ ప్రయోజనం సమకూరే ఒక కార్యక్రమానికి నడుం కట్టారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-05-30T09:29:53+05:30 IST