‘విశ్రాంతి’లో ప్రశాంతత కరువు!

ABN , First Publish Date - 2021-03-22T09:37:33+05:30 IST

ఒకటో తేదీన పింఛనుగా రావాల్సిన పెన్షన్‌ ఎప్పుడొస్తుందో తెలియదు! స్కేల్‌ పెంచాలన్న డిమాండ్లు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటికి తోడు.. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా

‘విశ్రాంతి’లో ప్రశాంతత కరువు!

ఫ్యామిలీ పెన్షనర్ల బాధలు వర్ణనాతీతం 

నెలవారీ పెన్షన్‌ ఎప్పుడిస్తారో తెలియదు

కొత్త స్కేల్‌ పెంచాలన్నా పరిష్కారం లేదు 

ఆరోగ్యశ్రీ కోసం పెన్షనర్ల నుంచి కోతలు 

అయినా అందని వైద్యసేవలు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఒకటో తేదీన పింఛనుగా రావాల్సిన పెన్షన్‌ ఎప్పుడొస్తుందో తెలియదు! స్కేల్‌ పెంచాలన్న డిమాండ్లు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటికి తోడు.. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందడంలేదు. వెరసి.. విశ్రాంత జీవనంలో.. ప్రశాంతత కరవైంది! ఇవీ పలు జిల్లాల్లో పెన్షర్ల బాధలు! గతేడాది నుంచీ ఇదే దుస్థితి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఏదైనా చేసిందంటే.. అది 27 శాతం తాత్కాలిక భృతి మంజూరు మాత్రమే! గత ప్రభుత్వం ఏప్రిల్‌ 1, 2019 నుంచి మంజూరు చేస్తే.. ఈ ప్రభుత్వం మూడు నెలలు కోత విధించి జూలై 1, 2019 నుంచి 27 శాతం మేర తాత్కాలిక భృతిని మంజూరు చేసింది.


ఇప్పుడు.. ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్న అనేక డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పరిస్థితి. ఉద్యోగుల సమస్యలు పక్కన పెడితే.. ప్రధానంగా పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. స్కేల్స్‌  పెంచాల్సిందిగా ఉద్యోగులు, జూలై 1, 2018 నుంచి కొత్త స్కేళ్లను మంజూరు చేయాలని పెన్షనర్లు కోరుతున్నారు. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏపీ అమరావతి జేఏసీ కూడా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఉద్యోగ సంఘాలు సమర్పించిన నివేదికలూ బుట్టదాఖలవుతున్నాయి. ఇక గతంలో ఒకటో తేదీన పెన్షన్‌  వచ్చేది. 2020 నుంచి పెన్షన్స్‌ ఏ తేదీన ఇస్తున్నారో తెలియని పరిస్థితి. ‘మా వేతనాలు కాస్త ఆలస్యమైనా.. పెన్షనర్లకు మాత్రం మొదటి తేదీనే ఇవ్వండి’ అంటూ ఉద్యోగ సంఘాలు స్వయంగా ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు లేఖలు రాసినా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావటం లేదు.


‘మంచి నీరైనా తాగి పస్తులుండవచ్చేమో గానీ,  మందులు వేసుకోకుండా జీవించటం కష్టం. సకాలంలో పెన్షన్‌ అందకపోవటంతో.. నిర్ణీత సమయంలో మందులను కొనుగోలు చేయలేకనానా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ జీవనమే కాదు.. మా ఆరోగ్య సమస్యలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంద’ని పెన్షనర్లు వాపోతున్నారు. వీరి ఇబ్బందులపై ముఖ్యమంత్రి సలహాదారులకు, ఆర్థిక శాఖకు ఉద్యోగ సంఘాలు పలుమార్లు వినతిపత్రాలిచ్చాయి. అయినా పట్టించుకున్న నాథుడు లేడు.


ఆరోగ్యశ్రీ సేవలు పొందలేని దౌర్భాగ్య పరిస్థితి 

పెన్షనర్లు ఆఖరికి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను కూడా పొందలేకపోతున్నారు. పెన్షనర్ల గ్రేడ్‌లను బట్టి రూ.225, రూ.300ల చొప్పున ప్రభుత్వం కోత వేస్తున్నా.. వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందటం లేదు. ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను అందించటానికి ససేమిరా అంటున్నాయి. దీంతో వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి.


కరవు భత్యం బకాయిలు ఏవీ? 

2018, 2019, 2020ల నుంచి బకాయి పడిన కరవు భత్యాలను మూడు విడతలుగా మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఫిబ్రవరిలో చెల్లించాల్సిన మొదటి విడత డీఏ బకాయిలు ఈ రోజు వరకు జమ కాలేదు. రెండో విడత బకాయిలు మార్చి నెలలో ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ బకాయిలు ఖాతాలో జమ కాలేదు. బకాయిలు ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే.. ఆ బకాయిలు చెల్లిస్తే.. ప్రభుత్వానికి రావాల్సిన రాబడి పన్నును ముందుగానే ఫిబ్రవరి నెలలో కోత పెట్టారు. ఈ నిర్ణయం వల్ల కొద్ది మొత్తంలో పెన్షన్‌ అందుకునేవారు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2021-03-22T09:37:33+05:30 IST