మారిటైం బోర్డు దివాలా!
ABN , First Publish Date - 2021-12-31T08:38:07+05:30 IST
మారిటైం బోర్డు దివాలా!

1200 కోట్లు లాగేశారు
భావనపాడు, బందరు పోర్టుల నిర్మాణానికి పైసా కూడా మిగల్చలేదు
మిగులు నిధులే అన్నారు... మొత్తం ఊడ్చేశారు
మంత్రి పేర్ని ‘టికెట్ల’పై చూపే శ్రద్ధ నియోజకవర్గంలోని పోర్టు నిర్మాణంపై చూపించాలి
ప్రభుత్వానికి దమ్ముంటే ‘బోర్డు’ నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఫైర్
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘పోర్టులను పర్యవేక్షించే మారిటైం బోర్డు నుంచి జగన్‌రెడ్డి ప్రభుత్వం రూ.1,200 కోట్లు లాగేసింది. ఈ నిధుల నుంచే భావనపాడు, బందరు పోర్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ పని కోసం పైసా కూడా ప్రభుత్వం మిగల్చలేదు. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డుల్లో ఉన్న మిగులు నిధులు మాత్రమే తీసుకుంటామని జీవో నంబరు 17లో ప్రభుత్వం పేర్కొంది. అందుకు భిన్నంగా ఇప్పుడు పైసా కూడా మిగల్చకుండా ఊడ్చేసి మారిటైం బోర్డును దివాలా తీయించింది’’ అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. గురువారం ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి రూ.450 కోట్లు లాక్కొన్న ప్రభుత్వం అదే ఊపులో మారిటైం బోర్డులో నుంచి మొత్తం సొమ్మును తీసేసుకొందని చెప్పారు. ‘‘మారిటైం బోర్డుకు ప్రతి ఏడాది కాకినాడ డీప్ వాటర్ పోర్టు నుంచి రూ.100 నుంచి రూ.120 కోట్లు, కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి రూ.30 - 40 కోట్లు, గంగవరం పోర్టు నుంచి రూ.40 కోట్లు, కృష్ణపట్నం పోర్టు నుంచి రూ.50 - 60 కోట్లు వస్తాయి. గత రెండున్నరేళ్లలో ఈ బోర్డు వద్ద వీటి ద్వారా రూ.600 కోట్లు చేరాయి. గంగవరం పోర్టులో తన వాటాను ప్రభుత్వం తెగనమ్మితే మరో రూ.645 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం డబ్బులను ప్రభుత్వం తన రోజువారీ ఖర్చుల కోసం తీసేసుకుంది. ఇవి మిగులు నిధులు కావు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించదల్చిన పోర్టుల కోసం ఆ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంది. వైసీపీ సర్కారు నిర్ణయం మేరకు ఈపీసీ విధానంలో భావనపాడు, బందరు, రామాయపట్నం పోర్టులను నిర్మించాల్సి ఉంది. ఈ విధానంలో పెట్టుబడి మొత్తం ప్రభుత్వం పెట్టాలి. దానికి రూ.10 వేల కోట్లు కావాలి. ప్రభుత్వం ఇవ్వగలిగే పరిస్థితిలో లేదు. మారిటైం బోర్డు వద్ద ఉన్న నిధులు కూడా లాగేసుకుంది. టెండర్ తీసుకొన్న సంస్థలు పనులు మొదలు పెట్టాలంటే వాటికి 10 శాతం అడ్వాన్సుగా ఇవ్వాలి. అంటే రూ.1,000 కోట్లు ఇవ్వాలి. ఈ పరిస్థితి చూసే పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే వేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఎన్నిసార్లు పొడిగించినా అదే పరిస్థితి. మారిటైం బోర్డు ఆడిట్ రిపోర్టు ఏటా శాసన సభ ముందు పెట్టాలి. కాని వాస్తవాలు బయటకు వస్తాయని రెండేళ్లుగా దానిని సభ ముందు పెట్టడం లేదు. మత్స్యకారుల కోసం నిర్మించే ఫిషింగ్ హార్బర్లలో పనులు చేసిన వారికి రూ.70 కోట్లు చెల్లించాలి. అవి కూడా ఇవ్వలేక పెండింగ్‌లో పెట్టారు. అలాంటి ప్రభుత్వం పోర్టులు కడుతుందా? మంత్రి పేర్ని నాని సినిమా టికెట్ల వ్యవహారంపై చూపే శ్రద్ధ తన నియోజకవర్గంలో నిర్మించాల్సిన పోర్టుపై చూపడం లేదు. ముందు ఆయన దానిని పట్టించుకొంటే మంచిది. ప్రభుత్వానికి దమ్ముంటే మారిటైం బోర్డు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని పట్టాభి డిమాండ్ చేశారు.