ఏపీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు

ABN , First Publish Date - 2021-05-05T08:55:13+05:30 IST

ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ పరీక్షల్లో అభ్యర్థులకు న్యాయం జరిగేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆరోపించారు

ఏపీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు

ప్రజల ప్రాణాలు కరోనాకు వదిలేశారు

ప్రతిపక్షంపై కక్షసాధిస్తున్నారు: లోకేశ్‌ 


అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ పరీక్షల్లో అభ్యర్థులకు న్యాయం జరిగేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆరోపించారు. అనేక అవకతవకలు జరిగాయని, పర్యవేక్షణలేని డిజిటల్‌ మూల్యాంకనం, ఎంపికల వల్ల పలువురు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు న్యాయం చేయకుంటే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అలాగే, ప్రజల ప్రాణాలు కరోనాకు వదిలి, ప్రతిపక్షంపై కక్ష సాధిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ మూర్ఖపురెడ్డి అని పేర్కొన్నారు. ‘రాజధానిపై మీ కుట్రల్ని బయటపెట్టారనే కక్షతో సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్టు చేయించారు. డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు పాజిటివ్‌ వచ్చింది. నరేంద్ర కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. వారి ఆరోగ్యం క్షీణిస్తే ప్రభుత్వానిదే బాధ్యత’ అని హెచ్చరించారు. కాగా.. అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నామని ఒక పక్క కోర్టులకు చెబుతూ, మరో పక్క ప్రభుత్వం  కొందరు విద్యార్థులకు పరీక్షలు పెడుతూనే ఉందని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ విమర్శించారు. ‘డీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలను సోమవారం నుంచి మొదలుపెట్టారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ పెడుతున్నారు. ఈ సమయంలో పరీక్షలెలా పెడుతున్నారు? మద్యం దుకాణాలను తక్షణం మూసి వేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-05T08:55:13+05:30 IST