ఆనందయ్య మందు పంపిణీపై స్థానికుల అభ్యంతరం

ABN , First Publish Date - 2021-12-28T08:42:01+05:30 IST

ఆనందయ్య మందు పంపిణీపై నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వివాదం రేగింది. ఒమైక్రాన్‌ వేరియంట్‌కి తాను ఆయుర్వేద మందు తయారు చేశానని, పంపిణీకి సిద్ధంగా ఉందని ఇటీవల బొనిగి ఆనందయ్య ప్రకటించారు.

ఆనందయ్య మందు పంపిణీపై స్థానికుల అభ్యంతరం

ముత్తుకూరు, డిసెంబరు 27: ఆనందయ్య మందు పంపిణీపై నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వివాదం రేగింది. ఒమైక్రాన్‌ వేరియంట్‌కి తాను ఆయుర్వేద మందు తయారు చేశానని, పంపిణీకి సిద్ధంగా ఉందని ఇటీవల బొనిగి ఆనందయ్య ప్రకటించారు. దీంతో పలు ప్రాంతాల నుంచి కొవిడ్‌ బాధితులు భారీగా సోమవారం కృష్ణపట్నం తరలివచ్చారు. వారంతా గ్రామంలోకి రావడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనందయ్య ఇంటివద్దకు వెళ్లి మందు పంపిణీని అడ్డుకున్నారు. కొవిడ్‌ బాధితులు గ్రామంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. గతంలోనూ మందు పంపిణీ సమయంలో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే మందు పంపిణీకి తనకు అనుమతులు ఉన్నాయని ఆనందయ్య చెప్పడంతో అందుకు సంబంధించిన కాగితాలు చూపాలని పట్టుబట్టారు. ఈ విషయంపై ఆనందయ్య అనుచర వర్గానికి, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. మందు పంపిణీకి సంబంధించి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, మీవద్ద అనుమతులు ఉంటే చూపించమని ఆనందయ్యను ఎస్‌ఐ అంజిరెడ్డి కోరారు. ఆనందయ్య ఇంటి వద్ద పికెట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీకి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని ముత్తుకూరు తహసీల్దారు సోమ్లానాయక్‌ స్పష్టం చేశారు. గ్రామస్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున మందు పంపిణీ నిలిపివేయాలని సూచించారు. 

Updated Date - 2021-12-28T08:42:01+05:30 IST