ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటన రేపు!

ABN , First Publish Date - 2021-11-09T08:04:17+05:30 IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నప్పటికీ పేర్లను అధికారికంగా

ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటన రేపు!

అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నప్పటికీ పేర్లను అధికారికంగా బుధవారం వెల్లడించే వీలుందని పార్టీ ముఖ్యనేతలు తెలిపారు.  ఒడిసా సీఎంతో భేటీ అనంతరం మంగళవారం రాత్రికి తాడేపల్లికి తిరిగి వచ్చిన తరువాత జాబితాను ప్రకటించే అవకాశముందటున్నారు. కడప జిల్లాకు చెందిన గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్‌ చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించగా ఒకదానికి కర్నూలు జిల్లాకు చెందిన ముస్లిం మైనారిటీ అభ్యర్థిని ప్రకటిస్తారని చెబుతున్నారు. మూడో స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత పాలవలస రాజశేఖరం కుమారుడు విక్రాంత్‌కు అవకాశం ఇవ్వాలన్న యోచనలో జగన్‌ ఉన్నారని అంటున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారని సమాచారం. ఎమ్మెల్సీగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్‌, ప్రకాశం జిల్లా పర్చూరు ఇన్‌చార్జి రావి రామనాథబాబు, ముఖ్యమంత్రి జగన్‌ కార్యక్రమాల పర్యవేక్షకుడు తలశిల రఘురామ్‌కు అవకాశం ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ జాబితా పరిశీలనలో విశాఖకు చెందిన వంశీకృష్ణ యాదవ్‌ పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. 

Updated Date - 2021-11-09T08:04:17+05:30 IST