ఆక్సిజన్‌ సరఫరా పెంచుదాం

ABN , First Publish Date - 2021-05-02T08:42:50+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్‌ సరఫరాను భారీగా పెంచుకోవడానికి అవసరమైన మరిన్ని మౌలిక వనరులను సమకూర్చుకోవాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది

ఆక్సిజన్‌ సరఫరా పెంచుదాం

10 క్రయోజనిక్‌ ట్యాంకర్ల కొనుగోలుకు నిర్ణయం

సింగపూర్‌ నుంచి దిగుమతికి సీఎం ఆమోదం 


అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్‌ సరఫరాను భారీగా పెంచుకోవడానికి అవసరమైన మరిన్ని మౌలిక వనరులను సమకూర్చుకోవాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీనికోసం సింగపూర్‌ నుంచి 10 క్రయోజనిక్‌ ట్యాంకర్లు దిగుమతి చేసుకోవాలన్న ప్రతిపాదనకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, ట్యాంకర్లు వీలైనంత వేగంగా రాష్ట్రానికి వచ్చేలా సన్నహాలు చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ ప్రత్యేకాధికారి ఎం.టి.కృష్ణబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఆక్సిజన్‌ ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. 


అవి సగటున 5 టన్నుల ప్రాణవాయువును మాత్రమే సరఫరా చేయగలవు. ఈ ట్యాంకర్లు డిమాండ్‌ను అందుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కోటి కనీసం 20 టన్నుల సామర్థ్యం ఉన్న క్రయోజనిక్‌ ట్యాంకర్లు సింగపూర్‌ నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వాటినుంచి ఏపీకి ఒకటి, రెండు ట్యాంకర్లు వస్తాయని ఇప్పటికే ఢి ల్లీ నుంచి సంకేతాలు వచ్చాయి.  ఆక్సిజన్‌ సర ఫరా సమస్యను అధిగమించేందుకు లాజిస్టిక్స్‌ను మెరుగుపర్చుకోవాలని, ఇందుకు రాష్ట్రమే క్రయోజెనిక్‌ ట్యాంకర్లను సొంతగా కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ధ్రువీకరించారు. 


600 టన్నులు కేటాయించండి 

అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజూ 20వేల మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. రానున్న రోజుల్లో కొవిడ్‌ మరింత తీవ్ర రూపం దాలిస్తే ఆక్సిజన్‌ అవసరం భారీగా పెరగనుందని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. శనివారం రాత్రి కేంద్ర అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రానికి కనీసం 600 టన్నులను కేటాయించాలని కోరినట్లు తెలిసింది.

Updated Date - 2021-05-02T08:42:50+05:30 IST