కాలు దువ్వుతున్న కోళ్లు

ABN , First Publish Date - 2021-01-13T09:08:00+05:30 IST

కోడి పందేలపై మళ్లీ అదే సస్పెన్స్‌. జరుగుతాయా..! లేదా? అని. కోర్టుల ఆదేశాలు.. పోలీసుల హడావుడి...

కాలు దువ్వుతున్న కోళ్లు

పందేలకు సర్వసన్నద్ధం

కోనసీమలో 20కిపైగా బరులు

కేశనకుర్రుపాలెంలో వీఐపీ బరి

ర్యాలి గ్రామంలో ఇన్విటేషన్‌ పేకాట 

పశ్చిమలో సిద్ధమవుతున్న బరులు

గతంకంటే తగ్గవచ్చని అంచనా

పర్యాటకుల రాకపై అనుమానాలు

కృష్ణాలో పేకాటకు ఫ్లడ్‌లైట్లు

పందేల్ని అడ్డుకుంటాం: పోలీసులు

వందల సంఖ్యలో బరులు ధ్వంసం

పట్టించుకోవద్దు.. తరలిరండి

వైసీపీ నేతల పరోక్ష సంకేతాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): కోడి పందేలపై మళ్లీ అదే సస్పెన్స్‌. జరుగుతాయా..! లేదా? అని. కోర్టుల ఆదేశాలు.. పోలీసుల హడావుడి... మైకుల్లో ప్రచారాలు, కత్తులు, పుంజుల స్వాధీనం, బరుల ధ్వంసం, నిర్వాహకుల అరెస్టులు అన్నీ సాగిపోతున్నాయి. ఇవన్నీ మామూలే! పండగ మూడు రోజులూ పందేలు జరుగుతాయి. మీరొచ్చేయండి.. అంటూ అధికార పార్టీ నాయకుల సందేశాలు. ఇందుకు తగినట్టుగా పందేల బరులూ సిద్ధమైపోతున్నాయి. నిర్వాహకులు కోళ్లు, కత్తులు సిద్ధం చేసుకుంటున్నారు. ఓచోట పోలీసులు బరిని ధ్వంసం చేస్తే.. మరోచోట బరులు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ గేలరీలు, పేకాటకు ఫ్లడ్‌లైట్లు, భారీగా మద్యం దుకాణాలు అన్ని ఏర్పాట్లూ చకచకా సాగిపోతున్నాయి.


పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో సోమ, మంగళవారాల్లో కోడి పందేల బరుల కోసం స్థలాలను గుర్తించారు. భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, కాళ్ళ, ఉండి, ఆకివీడు, మొగల్తూరు, యలమంచిలి, పాలకొల్లు, పోడూరు, పెనుమంట్ర, గణపవరం వంటి మండలాల్లో స్థలాలను శుభ్రం చేసే పని చేపట్టారు. ఐతే గత ఏడేళ్లుగా సంప్రదాయ డింకీ పందేలను భీమవరంలో ఎంపీ కనుమూరి రాఘురామకృష్ణంరాజు లాంఛనంగా ప్రారంభించేవారు. ఈసారి ఆయన భీమవరం రావడం లేదని సన్నిహితులు చెప్పారు.  హైకోర్టు ఆదేశాలతో గత ఏడాది వెంపలోనూ, ఆ పక్కనే ఉన్న భీమవరంలోనూ పందేలు నిలుపుదల చేశారు. అయినప్పటికీ సుమారు 200 ప్రాంతాల్లో పందేలు జరియి. 2019తో పోలిస్తే వందకుపైగా కేంద్రాల్లో తగ్గాయి.


పెద్ద బరుల్లోనే నడిచాయి. కోర్టు వ్యాజ్యం వల్ల ఈసారీ వెంప, భీమవరంలలో పందేలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కోర్టు వ్యాజ్యం, కరోనా నిబంధనల నేపథ్యంలో పందేలు నిర్వహించొద్దని పోలీసులు సీరియ్‌సగా హెచ్చరికలు చేశారు. గత వారం రోజులుగా సుమారు 50 ప్రాంతాల్లోని పందెం బరులను పోలీసులు తొలగించారు. పోలీసులు ఓవైపు తొలగిస్తూ ఉంటే.. నిర్వాహకులు మరో ప్రాంతంలో బరులను ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గత ఏడాది అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీగా పందేలు నిర్వహించారు. ఈసారి కొంత సస్పెన్స్‌ కొనసాగుతున్నా.. చివరికి అంతా సజావుగా సాగుతుందని అంటున్నారు. కాగా, భీమవరంలో కోడి పందేలు చూసేందుకు ఏటా స్నేహితులు, బంధువుల కుటుంబ సభ్యులతోపాటు సుమారు రెండు లక్షల మంది టూరిస్టులు వచ్చేవారు. ఈసారి ఆస్థాయిలో వచ్చే అవకాశం లేదని భీమవరం ప్రాంత హోటల్‌ యజమానులు చెబుతున్నారు.


కోనసీమలో 20కిపైగా బరులు

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో 20కిపైగా పెద్ద బరులు, వందకుపైగా చిన్న బరులు సిద్ధం చేస్తున్నారు. పెద్ద ఎత్తున జరిగే పందేలను తిలకించేందుకు పందెపురాయుళ్లు కోనసీమకు క్యూ కడుతున్నారు. బుధవారం భోగి పండుగ సందర్భంగా ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నేతలతో పందెం బరులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కీలక పందేలు నిర్వహించే ప్రాంతాల్లో గుండాట, పేకాట, మద్యంషాపుల నిర్వహణ కోసం బహిరంగ వేలం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో అశ్లీల నృత్యాల నిర్వహణకూ సన్నాహాలు చేస్తున్నారు. కొత్తపేట కేంద్రంగా వైసీపీ నాయకులు భారీ బరిని ఏర్పాటుచేశారు. ప్రధానంగా ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలో జిల్లాలోనే అతిపెద్ద బరిని సిద్ధం చేశారు. ఇక్కడ గుండాట నిర్వహణను రికార్డుస్థాయిలో రూ.50 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. మద్యం షాపులు, సైకిల్‌ స్టాండులు, కారు పార్కింగ్‌, ఇతర స్టాల్స్‌ నుంచి కూడా లక్షల రూపాయలు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామ శివారు చిన్నావారిపాలెంలోని పంట పొలాల్లో పేకాట ఇన్విటేషన్‌ పోటీల కోసం భారీ సెట్టింగులతో బోర్డులు సిద్ధమయ్యాయి.


చిన్న బరికి రూ.లక్ష.. ఆపై స్థాయిని బట్టి వసూళ్లు

కృష్ణా జిల్లాలో కోడి పందేలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ భారీస్థాయిలో బరులు సిద్ధమయ్యాయి. విజయవాడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలతోపాటు గుడివాడ, గన్నవరం, పెనమలూరు, బంటుమిల్లి, కైకలూరు, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు ప్రాంతాల్లో బరులను ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్లకు ఫోన్లు చేసి పిలుస్తున్నారు. గడచిన ఏడాది జిల్లాలో 12 నుంచి 15కోట్ల వరకు కోడి పందేలు జరిగాయి. ఈసారి అంత మొత్తంలో పందేలు జరగకపోవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. పోలీసులు బరులను ట్రాక్టర్లతో ధ్వంసం చేస్తున్నారు. మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లోని తోటల్లో నిర్వాహకులు రహస్యంగా బరులు తయారు చేస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల కోడిపుంజులకు కట్టే కత్తులను భారీగా తయారు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఇప్పటికే బెట్టింగ్‌ బాబులు విజయవాడ చేరుకుని హోటళ్లలో మకాం వేశారు.


 ఎన్ని అడ్డంకులు వచ్చినా.. బుధవారం ఉదయం పందేలు వేసేది ఖాయమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. గుడివాడకు సమీపంలోని కే కన్వెన్షన్‌ ప్రాంగణంలో నిర్వహించే జాతీయ స్థాయి ఎడ్ల పందేల ప్రాంగణం పక్కన కోతముక్క, కోడిపందేల నిర్వహణకు రంగం చేస్తున్నారని సమాచారం. పందేలు వేయవద్దని పోలీసులు చెబుతుండగా.. వారితో బేరసారాలకు అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. బరుల వద్ద పేకాట, గుండాటలు ఆడించేందుకు బేరాసారాలు జరుగుతున్నాయి. చిన్నబరికి సైతం లక్ష రూపాయల వరకు పోలీసులు వసూలు చేసి అనుమతులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా పెద్ద బరులకు ఆ స్థాయిని బట్టి బేరాలు సాగుతున్నాయి. నూజివీడు సమీప జనార్దనవరం, కొప్పాక ప్రాంతాల్లో పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. కోడిపందేల బరుల వద్ద మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లోనూ పేకాట సాగేందుకు ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - 2021-01-13T09:08:00+05:30 IST