ఎయిడెడ్‌ స్కూళ్లను కొనసాగిస్తాం

ABN , First Publish Date - 2021-11-02T08:26:23+05:30 IST

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎయిడెడ్‌ స్కూళ్లను పాత పద్థతిలోనే కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగింది. అందులో ఎయిడెడ్‌ స్కూళ్ల విషయం చర్చకు వచ్చింది.

ఎయిడెడ్‌ స్కూళ్లను కొనసాగిస్తాం

  • మేం అధికారంలోకి వస్తే ఆ బడులు ఉంటాయి
  • స్థానిక ఎన్నికల్లో రివర్స్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వాలి
  • టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో నేతలు


అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎయిడెడ్‌ స్కూళ్లను పాత పద్థతిలోనే కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగింది. అందులో ఎయిడెడ్‌ స్కూళ్ల విషయం చర్చకు వచ్చింది. ‘‘ఎంతోమంది దాతలు దానం చేసిన ఆస్తులు, భూములతో ఎయిడెడ్‌ స్కూళ్ల వ్యవస్థ ఏర్పడింది. ఆ భూములను దోచుకోవడానికి జగన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బడిలో ఉండాల్సిన విద్యార్థులను బజారుకీడ్చారు. ఎయిడెడ్‌ వ్యవస్థకు టీడీపీ అండగా ఉంటుంది’’ అని ఈ సమావేశం పేర్కొంది. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌, సెస్‌ తగ్గింపు కోసం పోరాడాలని ఈ సమావేశం నిర్ణయించింది. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల స్థాయికి పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వ పన్నులు తగ్గించాలని, దాని కోసం ప్రజలతో కలిసి పోరాడతామని ఈ సమావేశం తెలిపింది. రాష్ట్రంలో రూ.4,000 కోట్ల విలువైన బియ్యం కుంభకోణం చోటు చేసుకొందని, దొంగ బ్యాంక్‌ గ్యారంటీల పేరుతో జరిగిన మోసంలో సంబంధిత శాఖ మంత్రి పాత్ర ఉందని, వేల కోట్ల రూపాయల బియ్యం కుంభకోణంపై విచారణ జరిపించి దోషులను వెలికితీయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. డ్రగ్స్‌ లేని ఆంధ్రప్రదేశ్‌ కోసం టీడీపీ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ పేర్కొంది. 


అవతరణ దినోత్సవం ఏమైంది?

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నవంబరు 1వ తేదీన ఒకసారి జరిపిన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏమైందని టీడీపీ నేతల సమావేశం ప్రశ్నించింది. దానిని పక్కన పెట్టి అవార్డుల పేరుతో హడావుడి చేసి సీఎం జగన్‌రెడ్డి తన కుసంస్కారాన్ని బయట పెట్టుకొన్నారని ఆరోపించింది. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కనీసం గుర్తు చేసుకోకపోవడం దుర్మార్గమని సమావేశం విమర్శించింది. 13 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు జరగబోతున్న ఎన్నికల్లో రాష్ట్రంలో రివర్స్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తమ తీర్పు ఇవ్వాలని టీడీపీ సమావేశం విజ్ఞప్తి చేసింది. కరెంటు చార్జీల భారం, ధరల పెరుగుదల, పన్నుల బాదుడు తగ్గాలంటే ఈ ఎన్నికల్లో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని కోరింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకూడదన్న చిత్తశుద్ధి వైసీపీకి ఉంటే సీఎం ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అప్పులు కోసం చేసుకొన్న ఒప్పందాల్లో గవర్నర్‌ను బాధ్యునిగా చేర్చడం రాజద్రోహమే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘన కూడా అవుతుందని ఈ సమావేశం విమర్శించింది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు సూత్రధారులు సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జిషీటులో లేకపోవడం బాధాకరమని టీడీపీ సమావేశం వ్యాఖ్యానించింది.


దళిత మంత్రి నారాయణ స్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖను తొలగించి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి కట్టబెట్టడం దళిత వర్గాన్ని అవమానించడమేనని ఆ పార్టీ విమర్శించింది. కాగా, అప్పుల కోసమే జగన్‌రెడ్డి ఎయిడెడ్‌ విద్యా సంస్థల్ని, వాటి ఆస్తుల్ని కబళించడానికి సిద్ధమయ్యాడని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.  ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై కోర్టులకూ అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

Updated Date - 2021-11-02T08:26:23+05:30 IST