మీ లీడర్‌ను చూడాలని ఉంది!
ABN , First Publish Date - 2021-11-19T07:34:31+05:30 IST
‘మీ లీడరును చూడాలని ఉంది. చంద్రబాబును శాసనసభ సమావేశాలకు తీసుకురండి’ అని టీడీఎల్పీ ఉపనేత కె.అచ్చెన్నాయుడుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు....
చంద్రబాబును అసెంబ్లీకి తీసుకురండి.. బీఏసీ భేటీలో అచ్చెన్నతో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు
మా నేత సభకు కచ్చితంగా వస్తారు... కుప్పంలో వైసీపీ ఎలా గెలిచిందో మీకూ.. మాకూ తెలుసు: అచ్చెన్న
చంద్రబాబును అసెంబ్లీకి తీసుకురండి
బీఏసీ భేటీలో అచ్చెన్నతో సీఎం జగన్ వ్యాఖ్యలు
మా నేత సభకు కచ్చితంగా వస్తారు: అచ్చెన్న
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘మీ లీడరును చూడాలని ఉంది. చంద్రబాబును శాసనసభ సమావేశాలకు తీసుకురండి’ అని టీడీఎల్పీ ఉపనేత కె.అచ్చెన్నాయుడుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారమిక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం జరిగింది. జగన్, అచ్చెన్నాయుడితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంతరెడ్డి పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీఏసీ భేటీకి అచ్చెన్న రావడంతోనే.. ‘కమాన్.. అచ్చెన్నా ది గ్రేట్.. నిన్న (బుధవారం) మీరిచ్చిన స్టేట్‌మెంట్ చూశాను’ అంటూ ఆహ్వానించారు. కుప్పంలో వైసీపీ గెలించిందని.. చంద్రబాబు ఓడిపోయారని మంత్రి అనిల్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు. అచ్చెన్నాయుడు బదులిస్తూ.. ‘కుప్పంలో మీరెలా గెలిచారో మీ అంతరాత్మకే తెలుసు. అక్కడ వైసీపీ ఎలా గెలిచిందో మీకూ తెలుసు.. మాకూ తెలుసు.. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఒకసారి మేం గెలుస్తాం. మరోసారి మీరు గెలుస్తారు. ఈసారి మీరు గెలిచారు.. అంతే’ అని జగన్‌నుద్దేశించి అన్నారు. కుప్పం, నెల్లూరు ఫలితాలను సీఎం ప్రస్తావిస్తూ.. ఈ ఫలితాల తర్వాత చంద్రబాబును చూడాలని ఉందని చెప్పారు. ఆయన్ను సభకు తీసుకురావాలన్నారు. చంద్రబాబు కచ్చితంగా సభకు వస్తారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇంతకూ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒక్క రోజు మాత్రమేనని స్పీకర్ చెప్పారు. సరేనంటూ అచ్చెన్న లేచి బయటకు వెళ్లబోతుండగా.. సీఎం కలుగజేసుకుని.. ఎన్నిరోజులు జరపాలని అచ్చెన్న ది గ్రేట్ కోరుకుంటున్నారని అడిగారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ ప్రస్తావించేందుకు కనీసం 15 రోజులైనా నిర్వహించాలని అచ్చెన్న కోరారు. సీఎం తన చొక్కా జేబు నుంచి చిన్న పుస్తకం తీసి చూస్తూ ‘అచ్చెన్న ది గ్రేట్ అడుగుతున్నారుగా! ఈ నెల 26 వరకూ నిర్వహిద్దాం. పెద్దాయన అడుగుతున్నారుగా.. కనీసం వారం రోజులైనా పెడదాం. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తుదాం’ అని అన్నారు. అచ్చెనతో సమన్వయం చేసుకోవాలంటూ చీఫ్‌విప్ గడికోటకు సూచించారు. మళ్లీ అంతలోనే.. చంద్రబాబును అసెంబ్లీకి తీసుకురావాలని అచ్చెన్నతో జగన్ అన్నారు. ఆయన ఇప్పుడు కూడా శాసనసభ ప్రాంగణంలోనే ఉన్నారని అచ్చెన్న అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. అచ్చెన్న కోరిన వెంటనే సమావేశాలను 26వ తేదీ దాకా కొనసాగించాలనుకోవడం అరుదని.. ప్రతిపక్షం కోరిన వెంటనే సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని.. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదంటూ జగన్‌ను ప్రశంసించారు. దీంతో 26వ తేదీ దాకా సమావేశాలు నిర్వహించాలని బీఏసీ తీర్మానించింది.
మండలి బీఏసీ రెండుసార్లు
శాసనమండలి సభా వ్యవహారాల సంఘం (బీఏసీ) సమావేశం గురువారం రెండుసార్లు జరిగింది. మండలి సమావేశాలను ఒక రోజే జరపాలని మొదట జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ 26వ తేదీ దాకా జరపాలని శాసనసభ బీఏసీ నిర్ణయించిన దరిమిలా.. మండలి రెండోసారి భేటీ అయింది. మండలి ప్రొటెం చైర్మన్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం అధ్యక్షతన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బీఏసీ జరిగింది. మండలిలో గురువారం చర్చకు చేపట్టాల్సిన అంశాలపై టీడీపీ, పీడీఎఫ్, బీజేపీ వేర్వేరుగా వాయిదా తీర్మానాలను చైర్మన్‌కు అందచేశాయి. అప్పటికి సమయం పది గంటలు కావస్తుండడంతో సంప్రదాయం ప్రకారం పది గంటలకు మండలి సమావేశాన్ని ప్రారంభించాలని యనమల సూచించారు. అప్పటికి అసెంబ్లీ బీఏసీ సమావేశం ఇంకా నడుస్తూనే ఉంది. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకూ జరపాలని అక్కడ నిర్ణయించారు. దీంతో ప్రొటెం చైర్మన్ మళ్లీ బీఏసీ సమావేశం జరిపారు. మండలి సమావేశాలు కూడా ఈ నెల 26వ తేదీ వరకూ జరపాలని నిర్ణయం తీసుకున్నారు.