భూ సర్వే రివర్స్‌!

ABN , First Publish Date - 2021-08-29T09:26:22+05:30 IST

సీన్‌ రివర్స్‌ అయింది. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే మొదటికొచ్చింది. సర్వే ఆఫ్‌ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమైందో గాని.. డ్రోన్‌ సర్వే చేసేందుకు జగన్‌ ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలవడం అందరినీ విస్మయానికి

భూ సర్వే రివర్స్‌!

  • 9 నెలల్లోనే మళ్లీ మొదటికి.. కొత్తగా డ్రోన్‌ సర్వేకు టెండర్లు
  • కీలక అంశాల్లో డేటా ఇవ్వకుండా ఖాళీలు
  • టెండర్‌ నోటీసు తేదీ, బిడ్ల దాఖలు, తుది గడువు ప్రస్తావనే లేదు
  • ఈ వివరాలు తెలియకుండా టెండర్లలో పాల్గొనడం ఎలా?
  • సర్వే ప్రక్రియలో ప్రతి దశలోనూ లోపాలు
  • ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’


రాష్ట్ర ప్రభుత్వ అనుభవ లేమి, అధికారులు చేసిన తప్పులమీద తప్పులు.. భూముల సమగ్ర సర్వేను శాపాలుగా వెంటాడాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎస్‌వోఐ)తో సంయుక్తంగా చేపట్టిన భూముల సర్వే మొదటికి వచ్చింది. రీ సర్వే మొదలై 9 నెలలు పూర్తికాకముందే ఆ సంస్థతో సర్కారు సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో డ్రోన్ల సర్వే కోసం ఆ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) అమల్లో ఉన్నా.. ఇప్పుడు వేరుగా టెండర్లు పిలిచారు. మరి ఇప్పటిదాకా జరిగిన రీ సర్వే, పెట్టిన ఖర్చు ఏం కావాలి? 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సీన్‌ రివర్స్‌ అయింది. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే మొదటికొచ్చింది. సర్వే ఆఫ్‌ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమైందో గాని.. డ్రోన్‌ సర్వే చేసేందుకు జగన్‌ ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆధార్‌ నంబరును ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్రంలో ప్రతి భూమికీ 12 అంకెల విశిష్ట సంఖ్య ఉండాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం 2019లో భూధార్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. సర్వే నంబర్ల వారీగా ప్రతి భూమికి భూధార్‌ నంబరు ఇచ్చి దానిని ఆక్షాంశ, రేఖాంశాలతో జత చేయాలనుకున్నారు. దీనివల్ల భూముల వివాదాలు నిరోధించవచ్చని. ప్రతి ల్యాండ్‌ పార్సిల్‌కు జీపీఎస్‌ అనుసంధానమవడం వల్ల సాంకేతికంగా ముందడుగు పడుతుందని నాటి సర్కారు భావించింది. జగన్‌ ప్రభుత్వం రాగానే భూధార్‌ను  భూస్థాపితం చేశారు. అయితే ఆ ప్రాజెక్టు అమలు కోసం ఇచ్చిన జీవోల ఆధారంగానే భూముల సమగ్ర సర్వేకు ప్రణాళికలు వేశారు. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ సమగ్ర సర్వే చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.


భూధార్‌ పోయినా.. రీ సర్వే జరగబోతున్నందుకు అంతా సంతోషించారు. కానీ సీఎం ప్రకటనలను రెవెన్యూ. సర్వే శాఖల అధికారులు కొందరు సీరియ్‌సగా తీసుకోలేదు. కార్స్‌నెట్‌వర్క్‌ను సమకూర్చుకోవడం, టెండర్లు, ఆర్‌ఎ్‌ఫపీ, సాఫ్ట్‌వేర్‌ మొదలు అనేకానేక అంశాల్లో పలు వివాదాలు తెచ్చిపెట్టారు. వీటిలోని లోపాలను ఎప్పటికప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘ఆంధ్రజ్యోతి’ రాసింది కాబట్టి నిజమయినా సరే నమ్మలేమంటూ సర్కారు అధికారులను వెనకేసుకొచ్చింది. ఫైళ్లు మీడియా ముందు పెడుతున్నామంటూ హడావుడి చేసింది. చివరకు ‘ఆంధ్రజ్యోతి’ సంధించిన ప్రశ్నలకు బదులివ్వలేకపోయింది.


అనేక సందేహాలు, వివాదాల నడుమే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక సర్వే రిపోర్టులోనూ అనేక లోపాలున్నాయి. రాష్ట్రప్రభుత్వం సమకూర్చుకున్న కార్స్‌ నెట్‌వర్క్‌లో లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎస్‌వోఐ) నివేదిక ఇచ్చింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తే ‘ఆంధ్రజ్యోతి’కి ప్రభుత్వ పెద్దలు కుట్రలు, కుతంతాలు ఆపాదించారు. పైలట్‌ ప్రాజెక్టు ఫలితాలతో సంబంధం లేకుండానే గత ఏడాది డిసెంబరు 21న జగ్గయ్యపేట మండలంలోనే సీఎం చేతులమీదుగా సమగ్ర భూ సర్వేను ప్రారంభించారు. సర్వే ఆఫ్‌ ఇండియాతో 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్‌ సర్వేచేసి మ్యాపులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఎం సమక్షంలోనే సంతకాలు చేశారు. రూ.987 కోట్ల వ్యయంతో చేపట్టిన రీ సర్వేను 2023 నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


ఆయన కోరిక మేరకు భూముల సర్వేను దిగ్విజయంగా పూర్తిచేస్తామని.. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలబెడతామని ఈ నెల 12న తాడేపల్లిలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు భరోసా ఇచ్చారు. రీ సర్వే అద్భుతంగా జరుగుతోందని, అక్టోబరు నాటికి 51 గ్రామాల్లో రీ సర్వే పూర్తవుతుందని రైలుబొమ్మలతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఇది జరిగిన 16 రోజుల్లోనే సీన్‌ రివర్స్‌ అయింది. డ్రోన్‌ సర్వేకు ఏజెన్సీలు కావాలంటూ సర్కారు టెండర్లు పిలిచింది. 17,460 గ్రామాలు, 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్‌ సర్వే చేయాలని అందులో పేర్కొన్నారు.


ఏం జరిగి ఉంటుంది?

సీఎం జగన్‌ సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం 17,460 గ్రామాల్లో డ్రోన్‌సర్వేచేసి మ్యాపులు ఇచ్చే బాధ్యత సర్వే ఆఫ్‌ ఇండియాదే.  ల్యాండ్‌పార్సిల్‌ మ్యాప్‌లు (ఎల్‌పీఎమ్‌)లు జనరేట్‌చేసి వాటిని రీ సర్వేకు అందించే బాద్యత ఆ సంస్థదే. రూ.987 కోట్ల రీ సర్వే ప్రాజెక్టులో 81 కోట్లు డ్రోన్‌ సర్వే కోసం కేటాయించారు. వ్యవసాయ భూములు, ఆబాదీ, హ్యాబిటేషన్‌తోపాటు అటవీ భూములను కూడా సర్వే చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇతర శాఖల పరిధిలోని అంశాలను కూడా ఈ ఒప్పందంలోకి తీసుకొచ్చి సంతకాలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ నెల 25 నాటికి 782 గ్రామాల్లో 5.57 లక్షల ఎకరాల్లో డ్రోన్‌ సర్వేచేశారు. 685 హ్యాబిటేషన్స్‌లో సర్వే జరిగింది. అయితే సర్వే ఆఫ్‌ ఇండియాతో కొన్ని సమస్యలు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.


వారితో సర్దుకుపోవాలని.. కేంద్ర సంస్థలతో వివాదాలు వద్దని, కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. సరిగ్గా 16 రోజుల వ్యవధిలో సీన్‌ రివర్క్‌ అయింది. 17,460 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఏం జరిగి ఉంటుంది? సర్వే ఆఫ్‌ ఇండియాతో ప్రభుత్వానికి చెడిందా? ఒప్పందం ప్రకారం ఆ సంస్థతో డ్రోన్‌ సర్వే చేయించుకోవడంలో విఫలమయ్యారా? లేక ఆ సంస్థే వైదొలుగుతానని చెప్పిందా? ఈ విషయాలపై అధికారులు పెదవి విప్పడం లేదు. కొత్తగా డ్రోన్‌సర్వేను డివిజన్‌వారీగా అప్పగిస్తామని ఆర్‌ఎ్‌ఫపీలో పేర్కొన్నారు. గతంలో ఇదే పనిని సర్వేఆఫ్‌ ఇండియాకు అప్పగిస్తే చేయలేకపోయిందని డాక్యుమెంట్‌లో తెలపడం గమనార్హం, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ గురించి టెండర్‌ డాక్యుమెంట్‌లో ఇలా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కోరుకున్న పని చేయలేకపోయినందుకే సర్వే ఆఫ్‌  ఇండియాతో ఒప్పందం రద్దుచేసుకున్నారా? కొత్తగా టెండర్లు పిలిచే విషయాన్ని దానికి తెలియజేశారా అన్న ప్రశ్నలకు అధికారులు బదుల్వివలేదు.


ఆ ఖాళీలు ఎందుకో?

జ్యుడీషియల్‌ ప్రివ్యూ క మిషన్‌ ఆమోదం కోసం టెండర్‌ డాక్యుమెంట్‌ ఆర్‌ఎ్‌ఫపీని అప్‌లోడ్‌ చేశారు. అందులోనూ కీలకమైన అంశాల్లో ఖాళీలు పెట్టి వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెండర్‌ నోటీసు తేదీ, బిడ్లు దాఖలు చేయడం, టెక్నికల్‌  బిడ్‌లు తెరిచే సమయం, ప్రీ-బిడ్‌ మీటింగ్‌, బిడ్ల స్వీకరణకు తుదిగడువు వంటి విషయాల్లో స్పష్టమైన తేదీ ప్రకటించకుండా.. కేవలం ఆగస్టు నెల, 2021 అని రాసి వదిలేశారు. గతంలోనూ టెండర్‌ డాక్యుమెంట్లలో ఇలా అనేక ఖాళీలు వదిలిపెట్టినప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా ఇప్పుడు అదే పంథాను కొనసాగించడం గమనార్హం. మరి టెండర్‌లో పాల్గొనే సంస్థలకు అసలు విషయాలు తెలియవద్దా? బిడ్లు ఎప్పుడు స్వీకరిస్తారో.. దాఖలు గడువు ఎప్పుడు ముగుస్తుందో కూడా పేర్కొనపోతే టెండర్లు ఎలా వేస్తాయన్నది అసలు ప్రశ్న.


ఇదిలా ఉంటే.. డ్రోన్‌ సర్వే టెండర్లను ఆరు ప్యాకేజీలుగా విభజించారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ప్యాకేజీ-1గా పేర్కొన్నారు. ఇందులో 9 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. ప్యాకేజీ-2లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు (16 రెవెన్యూ డివిజన్లు) ఉన్నాయి. ప్యాకేజీ-3లో గుంటూరు, ప్రకాశం జిల్లాలు, ప్యాకేజీ-4లో కడప, కర్నూలు జిల్లాలు, ప్యాకేజీ-5లో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉండగా.. 6వ ప్యాకేజీలో అనంతపురం జిల్లాను చేర్చారు.

Updated Date - 2021-08-29T09:26:22+05:30 IST