కృష్ణా బోర్డు కార్యాలయం హైదరాబాద్‌లోనే?

ABN , First Publish Date - 2021-01-20T08:33:58+05:30 IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ

కృష్ణా బోర్డు కార్యాలయం హైదరాబాద్‌లోనే?

విశాఖలో ఏర్పాటుకు తెలంగాణ ససేమిరా


అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుండడమే దీనికి కారణం. నిజానికి ఈ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గతంలో తీర్మానించింది. అయితే విజయవాడకు బదులు వైజాగ్‌కు తరలించాలని గత నెల 25వ తేదీన నాటి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. ఈ నెల 4వ తేదీన జల వనరుల శాఖ ఈఎన్‌సీ హైదరాబాద్‌ వెళ్లి ఈ మేరకు ప్రతిపాదనలు కూడా ఇచ్చారు.


ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య వ్యతిరేకించింది. కృష్ణా నది లేని చోట కార్యాలయం ఏమిటని సమాఖ్య చైర్మన్‌ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు నిలదీశారు. ఇప్పుడు తెలంగాణ సర్కారు కూడా ఇదే ప్రశ్న లేవనెత్తింది. బోర్డు హెడ్‌క్వార్టర్స్‌ను కృష్ణా నది పరివాహక ప్రాంతమున్న విజయవాడకు తరలించేందుకు సమ్మతించామని.. కానీ బంగాళాఖాతమున్న వైజాగ్‌కు తరలించాలనుకోవడం ఏమిటనినిలదీసింది. వైజాగ్‌కు వెళ్లాలంటే చాలా దూరమవుతుందని.. బోర్డు అధికారులు కూడా తరచూ క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోవడం కష్టమవుతుందని తెలంగాణ సాగునీటి శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ బోర్డుకు లేఖ రాశారు. బడ్జెట్‌ భారమూ పెరుగుతుందని, అందుచేత బోర్డు కార్యాలయాన్ని వైజాగ్‌కు తరలించాలన్న నిర్ణయాన్ని తాము ఆమోదించడం లేదన్నారు. దీంతో.. ఇప్పట్లో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని, హైదరాబాద్‌లోనే బోర్డు కార్యాలయం కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - 2021-01-20T08:33:58+05:30 IST