కొడాలి.. ఆయనంటే పడాలి
ABN , First Publish Date - 2021-01-20T21:12:20+05:30 IST
గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్న ఆయన ఎవరేమన్నా వీరావేశంతో ఊగిపోతారు. కానీ..

అమరావతి: గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్న ఆయన ఎవరేమన్నా వీరావేశంతో ఊగిపోతారు. రాజకీయ ప్రత్యర్థులపై బూతు మాటలతో ఎగిరిపడతారు.. ఎదుటివారు అనడమే ఆలస్యం.. కసితీరా కౌంటర్ వేసేస్తారు. అలాంటి మంత్రి.. అదే ప్రత్యర్థి పార్టీకి చెందిన కీలక నేత విషయంలో మాత్రం నోరు మెదపరు. ఆయన ప్రత్యక్షంగా.. లేదా పరోక్షంగా వార్నింగ్‌లు ఇచ్చినా సరే వాటిపై సైలెంట్‌గా తప్పించుకుంటారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన ఎవరి విషయంలో అలా వ్యవహరిస్తున్నారు? అసలు కారణం ఏంటి?
కౌంటర్ వేస్తే ఎన్ కౌంటరేనని భయమా? లేదా భక్తితో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవమా? ఇది టీడీపీ ఎమ్మెల్యే సినీ హీరో బాలకృష్ణ ఇచ్చిన వార్నింగ్‌ల విషయంలో సైలెంట్‌గా ఉంటున్న మంత్రి కొడాలి నానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయనే కరెక్టు మొగుడని అనుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్ళలు చేసినా, సీఎం జగన్ తీరును తప్పుపట్టినా కొడాలి నాని అగ్గిమీద గుగ్గిలం అవుతారు. వారిపై బూతుల మాటలతో విరుచుకుపడతారు. వాడూ, వీడూ అంటూ అమర్యాద పదజాలంతో ఎదురుదాడికి దిగుతారు.
సీఎం జగన్ మెప్పు పొందడానికో, లేక తన మంత్రి పదవిని నిలబెట్టుకోడానికో తెలియదు గానీ మంత్రి తన రాజకీయ ప్రత్యర్థులపై శివాలెత్తుపోతుండడం మాత్రం ఇటీవల కాలంలో అధికమైంది. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర ముఖ్య నాయకుల్లో ఎవరైనా విమర్శలు, ఆరోపణలు చేస్తే వారిపై కొడాలి నాని ఎదురుదాడికి దిగుతారు. అలాంటి మంత్రి అదే ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య ఇప్పటి వరకు రెండుసార్లు కొడాలి నానికి పరోక్షంగా వార్నింగ్‌లు ఇచ్చారు. అయినా వాటిపై మంత్రి స్పందించకపోవడం గమనార్హం.
నోరు అదుపులో పెట్టుకో మాట వినకుంటే ఇక చేతలే.. అంటూ ఇటీవల బాలకృష్ణ చేసిన హెచ్చరిక వైరల్‌గా మారింది. పేకాట క్లబ్‌ల వివాదంలో కొడాలి నాని చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. వ్యవస్థలో చట్టాలు ఉన్నాయని, న్యాయమంటూ ఒకటుందని.. లెక్కలేకుండా కొందరు అనుచితంగా మట్లాడుతున్నారని బాలయ్య మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడం మంచిదికాదన్నారు. టీడీపీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తన సహనాన్ని పరీక్షించవద్దని, ఒట్టిమాటల మనిషినేకాదు.. అవసరమైతే చేతలు కూడా చూపిస్తా తస్మాత్ జాగ్రత్త అని బాలయ్య హెచ్చరించారు.