జగన్‌ సోదరులకు.. ఆఫ్రికాలో డ్రగ్స్‌ వ్యాపారాలు!

ABN , First Publish Date - 2021-10-07T08:51:16+05:30 IST

జగన్‌ సోదరులకు ఆఫ్రికాలో మాదక ద్రవ్యాల వ్యాపారాలు ఉన్నాయని టీీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు.

జగన్‌ సోదరులకు.. ఆఫ్రికాలో డ్రగ్స్‌ వ్యాపారాలు!

  • షిప్పుల్లో పీడీఎస్‌ బియ్యం ఎగుమతి
  • తిరిగొచ్చేటప్పుడు డ్రగ్స్‌ దిగుమతి: పట్టాభి ఫైర్‌

కాకినాడ సిటీ, అక్టోబరు 6: జగన్‌ సోదరులకు ఆఫ్రికాలో మాదక ద్రవ్యాల వ్యాపారాలు ఉన్నాయని టీీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో కొందరు వైసీపీ నాయకులు పౌరసరఫరాల బియ్యాన్ని షిప్పుల్లో ఎగుమతి చేస్తూ.. తిరిగి వాటిలో మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తున్నారని అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. మాదక ద్రవ్యాల దిగుమతిలో వైసీపీ వాళ్లకు లింకులు కలుపుతున్నామని తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దపాలేరు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆక్షేపించారు. ఐవరీ కోస్ట్‌, ఆఫ్రికాలో మాదక ద్రవ్యాల వ్యాపారంలో వైసీపీ వాళ్లకు ఎన్ని లింకులు ఉన్నాయో అడిగి తెలుసుకోవాలన్నారు. ఎ-2 విజయసాయిరెడ్డి దుబాయి వెళ్లేందుకు పాస్‌పోర్టు తిరిగి ఇవ్వాలని ఎందుకు కోర్టుకు దరఖాస్తు చేశారో సజ్జల చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్రమాలను వెలికితీస్తున్న మీడియాను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బెదిరిస్తున్నారని.. లారీలతో గుద్ది చంపేస్తామంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎంతమందిని లారీలతో గుద్దిస్తారని ప్రశ్నించారు. మాజీ హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. ఇసుక లారీలను అడ్డుకుంటే లారీలతో గుద్దించేస్తామని ఎమ్మెల్యే విలేకరులను బెదిరించడం సరికాదన్నారు.

Updated Date - 2021-10-07T08:51:16+05:30 IST