Telugudesam పార్టీలోకి కడప జిల్లా కీలక నేతలు..
ABN , First Publish Date - 2021-11-26T16:42:42+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో నేడు జమ్మలమడుగుకు చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరనున్నారు.

కడప : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నేడు జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సోదరుడే నారాయణరెడ్డి. కాగా.. పార్టీల చేరిన అనంతరం భూపేష్‌రెడ్డికి చంద్రబాబు జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించనున్నారు.
కాగా.. ఇటీవల టీడీపీ అధినేత కడప జిల్లాలో పర్యటించగా ఆయన్ను కలవడానికి భూపేశ్రెడ్డితోపాటు ఎమ్మెల్సీ శివనాథరెడ్డి సుమారు 20 వాహనాల్లో కార్యకర్తలతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ముఖ్యంగా గండికోట జలాశయంలో 27 టీఎంసీలు నీరు నిలువ ఉంచడంతోనే నష్టం జరిగిందని బాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు కష్టపడి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కొన్ని చోట్ల వరద ఉధృతికి, వర్షానికి పూర్తిగా నష్టం జరిగిందని చంద్రబాబుకు వివరించారు.

భూపేశ్‌కు ఏం పదవి ఇస్తారు..!?
ఆయన టీడీపీలో చేరితే.. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా దేవగుడి భూపేశ్రెడ్డిని నియమిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో దేవగుడి వర్గం, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య సుదీర్ఘకాలంగా ఫ్యాక్షన్ నెలకొంది. రామసుబ్బారెడ్డి వర్గం టీడీపీలో ఉండగా దేవగుడి వర్గం మొదట కాంగ్రెస్‌లో.. తర్వాత వైసీపీలో ఉంది. దేవగుడి వర్గం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలో చేరి మంత్రి అయ్యారు. రామసుబ్బారెడ్డిని టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీని చేసి విప్ పదవి ఇచ్చింది. గత ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా, ఆదినారాయణరెడ్డి ఎంపీగా పోటీ చేశారు. కాని ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోగా... రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు.
ప్రధాన వర్గాలు రెండూ బయటకు వెళ్లిపోవడంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. కాని రెండేళ్లలో ఈ నియోజకవర్గంలో కొత్త పరిణామాలు చోటు చేసుకొన్నాయి. దేవగుడి వర్గంలో చీలిక వచ్చింది. ఆ వర్గంలో ప్రధాన నేత అయిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపారు. జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకొన్న తర్వాత ఆయన కుమారుడు భూపేశ్‌కు నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో కడప జిల్లా నేతలు చంద్రబాబు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. తాము నియోజకవర్గంలో తమ వర్గానికి చెందిన వారందరినీ కలిసి మాట్లాడి మంచి రోజు చూసుకొని పార్టీలో చేరతామని దేవగుడి వర్గీయులు చెప్పినట్లు సమాచారం. కాగా.. కొంతకాలంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి జమ్మలమడుగు ఇన్చార్జిగా ఉన్నారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో ఆయన పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఉండడంతో జమ్మలమడుగుకు బలమైన నాయకత్వం కోసం పార్టీ కసరత్తు చేసింది. అందులో భాగంగా భూపేశ్‌ను ఎంపిక చేశారు.