న్యాయానికి అడ్డంకిగా పేదరికం, నిరక్షరాస్యత

ABN , First Publish Date - 2021-03-24T09:07:44+05:30 IST

పేదరికం, నిరక్షరాస్యత న్యాయానికి అడ్డంకిగా మారాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా) చైర్మన్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఢిల్లీ న్యాయసేవల అథారిటీ మంగళవారం

న్యాయానికి అడ్డంకిగా పేదరికం, నిరక్షరాస్యత

జస్టిస్‌ ఎన్వీ రమణ


న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పేదరికం, నిరక్షరాస్యత న్యాయానికి అడ్డంకిగా మారాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా) చైర్మన్‌  జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఢిల్లీ న్యాయసేవల అథారిటీ మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.   న్యాయం అందుబాటులో ఉండటం కేవలం నినాదం కాకూడదని మన రాజ్యాంగం నిర్దేశించినట్లు చెప్పారు. పేదరికం, న్యాయం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యల్లో మనం చిక్కుకుపోయామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 74 సంవత్సరాల తరువాత కూడా మనం ఈ విషయాలనే చర్చించడం విషాదకరమైనప్పటికీ  కుంగిపోకుండా వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలని చెప్పారు.


మహిళలు, పిల్లలు, కస్టడీలో ఉన్నవారు, ఎస్సీ, ఎస్టీ, ఇతర బాధితులకు ఆదాయంతో నిమిత్తం లేకుండా ఉచిత న్యాయసహాయం లభించే ఏకైక దేశం భారతదేశమని తెలిపారు. జనాభాలో 70 శాతం మందికి న్యాయసేవల అథారిటీలు సహాయపడుతున్నట్లు చెప్పారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో 48,227 మంది ప్యానెల్‌ న్యాయవాదులు పనిచేస్తున్నట్లు తెలిపారు. నల్సా ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవస్థ ప్రకారం సెషన్స్‌ కోర్టుల్లో పూర్తి స్థాయిలో న్యాయవాదులు న్యాయసహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరు ఒక్క 2020లోనే దేశంలోని 17 జిల్లాల్లో 1600 కేసులు వాదించినట్లు తెలిపారు.

Updated Date - 2021-03-24T09:07:44+05:30 IST