అమలుకాని హామీలతో జగన్ సీఎం అయ్యారు: జడ్జి రామకృష్ణ
ABN , First Publish Date - 2021-07-04T19:17:22+05:30 IST
అమలుకాని హామీలతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని జడ్జి రామకృష్ణ విమర్శించారు.
రాజమండ్రి: అమలుకాని హామీలతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు మతిమరుపు, మాయరోగం పట్టుకుందని జడ్జి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దళిత బిడ్డల హక్కులను సీఎం కాలరాస్తూ విద్వంస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే దళితులను ప్రాణాలతో ఉండనివ్వటం లేదన్నారు. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలను జగన్ తన చేతుల్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని అమలు చేయకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తీరు దళితులకు చాలా ప్రమాదకరమని, వైసీపీ రెండేళ్ళ పాలనలో దళితులు 200 ఏళ్ళు వెనక్కి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని జడ్జి రామకృష్ణ విమర్శించారు. జగన్ దేశమంతా, ప్రపంచమంతా తిరుగుతూ అప్పులు చేస్తున్నారని, 20 ఏళ్ల నుంచి న్యాయమూర్తిగా పనిచేస్తున్న తన ఫిర్యాదుపైనే పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీని ఆయన ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అధికారాలను సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు కట్టబెట్టాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్ తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు తన స్వగ్రామం నుంచి అమరావతి 660 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబుపై నంద్యాల సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై తాను చేసిన పిర్యాదుపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసే వరకు నిద్రపోనన్నారు. జగన్ను ముద్దాయిగా నిలబెడతానన్నారు. ఆగస్టు సంక్షోభం జగన్ విషయంలో పునరావృతం కాబోతుందని జడ్జి రామకృష్ణ అన్నారు.