జిన్నా టవర్‌ చరిత్ర ఇదే...

ABN , First Publish Date - 2021-12-31T01:06:03+05:30 IST

జిన్నా టవర్ విషయంలో బీజేపీ దూకుడు పెంచింది. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ను బీజేపీ నేతలు కలిశారు.

జిన్నా టవర్‌ చరిత్ర ఇదే...

గుంటూరు: జిన్నా టవర్ విషయంలో బీజేపీ దూకుడు పెంచింది. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ను బీజేపీ నేతలు కలిశారు. జిన్నా టవర్ పేరు మార్చాలంటూ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ నేత సత్యకుమార్ మాట్లాడుతూ మహ్మద్‌ అలీ జిన్నా భారతదేశ ద్రోహి అని అటువంటి వ్యక్తి పేరుమీద గుంటూరు వంటి ప్రధాన నగరంలో టవర్‌ ఉండటానికి వీలులేదని దాని పేరు మార్చి అబ్దుల్‌ కలాం లేదా గుర్రం జాషువా పేర్లు పెట్టాలని కోరారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కసారిగా ప్రకటనలు గుప్పించడం మొదలుపెట్టారు. పేరు మార్చాలని లేదంటే బాబ్రీ మసీదు కూల్చినట్లు కూల్చివేస్తామని హెచ్చరికలు చేశారు. 


బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ నేత మస్తాన్ వలి  ఓ ప్రకటనలో అన్నారు. జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ నేత సత్యకుమార్ చెప్పటం విడ్డూరమన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం నిర్మించిన కట్టడం అది, స్వాతంత్య్ర సమరయోధులు అంతా అప్పుడు టవర్ ఏర్పాటుకు మద్దతిచ్చారని చరిత్ర చెబుతోందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ నేతలు సున్నితమైన అంశాలు తెచ్చి ప్రజల మధ్య విద్వేషం పెంచుతున్నారని మస్తాన్ వలి మండిపడ్డారు. 


జిన్నాటవర్‌ చరిత్ర

1942లో ఇప్పటి సత్తెనపల్లి మండలం కొమ్మదిపూడిలో కొన్ని మతాల మధ్య గొడవలు జరిగాయి. దాన్ని స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంగా మరల్చిన వివాదంలో 14 మంది ముస్లింలకు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్‌ చేస్తూ అప్పటి గుంటూరు ఎమ్మెల్యే లాల్‌జాన్‌బాషా ముంబై కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్న ముస్లింలీగ్‌ అధినేత మహ్మద్‌ అలీ జిన్నాను కలిసి 14 మంది తరపున వాదించాలని కోరారు. వాదించిన జిన్నా ఉరిశిక్షను రద్దు చేయించారు. దీనిని గుర్తుంచేందుకు 1942లో అప్పటి స్వాతంత్య్ర ఉద్యమ కారులు మహ్మద్‌ అలీ జిన్నా పేరు మీద గుంటూరులో టవర్‌ను నిర్మించారు. దీనికి ఆయనను ఆహ్వానించారు. ఆయన వీలు కాకపోవడంతో ఆయన అనుచరుడు జులేదా లియాఖత్‌ అలీఖాన్‌ 1945లో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి దీని నిర్వహణ అంతా గుంటూరు నగరపాలక సంస్థ చూసుకుంటుంది.  


జిన్నాటవర్‌ సెంటర్‌ పేరు మార్చుతూ 1965-66 మధ్య అప్పటి మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసినట్లు చెబుతున్నారు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయ సైనికుడు క్వార్టల్‌ మార్షల్‌ హమీద్‌ ఆ యుద్ధంలో వీరమరణం పొందారు. ఆయన గౌరవార్థం జిన్నాటవర్‌ పేరును క్వార్టల్‌ మార్షల్‌ హమీద్‌ మందిర్‌గా మార్చుతూ తీర్మానం చేశారు. అనంతరం తీర్మానాన్ని అమలు చేయలేదు. బీజేపీ నాయకులు ప్రస్తుతం చేస్తున్న డిమాండ్‌ పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలోనే వచ్చింది. అపుడే తీర్మానం చేశారు. కానీ అనంతరం నాయకులు పట్టించుకోలేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

Updated Date - 2021-12-31T01:06:03+05:30 IST