జాబ్‌ క్యాలెండర్‌తో జగన్‌రెడ్డి మోసం

ABN , First Publish Date - 2021-07-12T08:19:31+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మావోయిస్టు పార్టీ మద్దతు తెలుపుతున్నట్టు ఈస్టు డివిజన్‌ ..

జాబ్‌ క్యాలెండర్‌తో జగన్‌రెడ్డి మోసం

నిరుద్యోగుల ఆందోళనలకు మావోయిస్టుల మద్దతు

ఈస్టు డివిజన్‌ కార్యదర్శి అరుణ పేరిట ఆడియా టేప్‌ విడుదల


సీలేరు(విశాఖ జిల్లా), జూలై 11: ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మావోయిస్టు పార్టీ మద్దతు తెలుపుతున్నట్టు ఈస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ పేరిట ఆదివారం ఒక ఆడియో టేప్‌ విడుదలైంది. కేవలం నిరసనల ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని, జగన్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆమె పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పోస్టులను భర్తీ చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌, అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత 10 వేల ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి నిరుద్యోగులను  మోసం చేశారని ఆరోపించారు.


ఇచ్చిన హామీ మేరకు కొత్త క్యాలెండర్‌ విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. అంతేకాక నూతన విద్యా విధానం వల్ల రాష్ట్రంలో 24 వేల ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయని, 37 వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలను కోల్పోతారని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో జీవో- 3ను అమలు చేసి, శత శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలను స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థులు, యువత, నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ఉద్యమించాలని అరుణ పిలుపునిచ్చారు.

Updated Date - 2021-07-12T08:19:31+05:30 IST