హిట్లర్ మాదిరిగా జగన్ దిగజారారు: దేవినేని

ABN , First Publish Date - 2021-01-12T21:53:04+05:30 IST

సీఎం జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో 150 దేవాలయాలపై దాడులు జరిగాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

హిట్లర్ మాదిరిగా జగన్ దిగజారారు: దేవినేని

అమరావతి: హిట్లర్ మాదిరిగా సీఎం జగన్మోహన్‌రెడ్డి దిగజారారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో 150 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని ఇప్పటివరకు వైసీపీ  ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. సీఎం జగన్ పట్టింపు లేని తనంతో రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.


 70 ఏళ్ల ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఇన్ని దాడులు ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్‌రెడ్డి ప్రభుత్వం మత, కుల, ప్రాంతీయ రాజకీయాలను రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను పట్టుకోవడంపై  జగన్‌కు శ్రద్ధ లేదని దుయ్యబట్టారు. దేవాలయాలపై దాడులు చేయిస్తూ ప్రతిపక్షాలపై కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు విధ్వంసాలకు పాల్పడి ఇతరులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి దాడుల ఉన్మాదాన్ని విడకపోతే చారిత్రక తప్పిదం చేసినవారవుతారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి దోషులను త్వరగా పట్టుకోవాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-12T21:53:04+05:30 IST