8 ఫిషింగ్‌ హార్బర్లు

ABN , First Publish Date - 2021-05-19T09:17:29+05:30 IST

‘ఆక్వా రైతులతో పాటు ఏ ఒక్క మత్స్యకారుడూ నష్టపోకూడదనే.. రాష్ట్రంలో 8 ఫిషింగ్‌ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. అలాగే 100పైగా ఆక్వా హబ్‌లు నిర్మించి, ఒక్కో హబ్‌ కింద 120 రిటైల్‌ షాపులు ఏర్పాటు చేసేలా...

8 ఫిషింగ్‌ హార్బర్లు

  • 100కు పైగా ఆక్వా హబ్‌లు
  • ఒక్కో హబ్‌లో 120 షాపులు
  • రెండేళ్లలో ఏర్పాటు చేస్తాం
  • మత్స్యకారులకు ప్రభుత్వ అండ
  • పశ్చిమగోదావరిలో విశ్వవిద్యాలయం
  • వేట నిషేధ కాలానికి 10 వేల సాయం
  • బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సీఎం జగన్‌

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘ఆక్వా రైతులతో పాటు ఏ ఒక్క మత్స్యకారుడూ నష్టపోకూడదనే.. రాష్ట్రంలో 8 ఫిషింగ్‌ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. అలాగే 100పైగా ఆక్వా హబ్‌లు నిర్మించి, ఒక్కో హబ్‌ కింద 120 రిటైల్‌ షాపులు ఏర్పాటు చేసేలా రెండేళ్ల కార్యాచరణ చేపట్టాం’ అని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దీనివల్ల ఆక్వా ఉత్పత్తులు, మత్స్యకారుల చేపలకు గిట్టుబాటు ధర వస్తుందని, 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, వాటిని రైతుభరోసా కేంద్రాలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద జాలర్లకు రూ.10 వేల చొప్పున అందించే ప్రక్రియను కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జగన్‌ ప్రారంభించారు. 1,19,875 మంది మత్స్యకారులకు రూ.119.88 కోట్లు జమ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు చేపల వేట నిషేధం వల్ల ఉపాధి కోల్పోయే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ‘రెండేళ్ల పాలనలోనే మూడో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటామన్న మాట నిలబెట్టుకుంటూ, కొవిడ్‌ వల్ల ఆర్ధిక ఇబ్బందులున్నా, ప్రభుత్వానికి పేదల కష్టాలే ముఖ్యమని భావించి, చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే జాలర్ల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తున్నాం. 


తొలి ఏడాది లక్ష మందికి,  ఇప్పుడు రూ.1.20లక్షల మందికి లబ్ధి కలుగుతున్న ఈ పథకం ద్వారా మూడేళ్లలో రూ.332 కోట్లు వెచ్చించాం. ప్రతి పథకంతో పేదలకు మేలు జరగాలన్నదే మా ఉద్దేశం. మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే, వెంటనే రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇప్పటికి 67 కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించాం. అలాగే ఆక్వాపై ఆధారపడిన రైతులకు అండగా నిలిచేందుకు ఆక్వా సాగుకు యూనిట్‌ విద్యుత్‌ రూపాయిన్నరకే అందిస్తున్నాం. ఇలా 53,550 మందికి లబ్ధి చేకూరుతోంది. దీనివల్ల ఏటా రూ.780 కోట్లు భారం పడుతున్నా.. రెండేళ్లలో రూ.1,560 కోట్ల రాయితీని ప్రభుత్వం భరించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాదిలోగా మత్స్య విశ్వవిద్యాలయం పనులు చేపడతాం. ఇందులో మత్స్యకారులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి, మంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మన మత్స్యకారులు ఉపాధి కోసం సుదూరప్రాంతాలకు వలస వెళ్లి, విదేశీ సముద్ర జలాల్లోకి ప్రవేశించి, జైళ్ల పాలవుతున్నారని గతంలో ఎవరూ ఆలోచించలేదు. ఇకపై ఆ పరిస్థితి వారికి రాకూడదని రూ.2,775 కోట్లతో 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఈ ఏడాదే పనులు ప్రారంభిస్తాం’ అని సీఎం తెలిపారు.


Updated Date - 2021-05-19T09:17:29+05:30 IST