ప్రాణం విలువ నాకు బాగా తెలుసు: జగన్‌

ABN , First Publish Date - 2021-05-20T20:12:40+05:30 IST

ప్రాణం విలువ తనకు బాగా తెలుసని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు..

ప్రాణం విలువ నాకు బాగా తెలుసు: జగన్‌

అమరావతి: ప్రాణం విలువ తనకు బాగా తెలుసని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు.. ఓదార్పుయాత్ర చేసి ప్రతి కుటుంబాన్ని పరామర్శించానని తెలిపారు. రెండేళ్లలో ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని అడుగులు వేశామని పేర్కొన్నారు. గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. ప్రతి 2 వేల మంది జనాభాకు ఒక ఏఎన్‌ఎంను నియమించామన్నారు. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేలా మార్పులు చేశామన్నారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ప్రాణం విలువ తెలుసుకాబట్టే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామని ప్రకటించారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 


‘‘ఒకేసారి 1180 అంబులెన్స్‌లను ప్రారంభించాం. ఏపీలో ప్రతిరోజు లక్ష కరోనా టెస్టులు చేస్తున్నాం. నాడు- నేడు కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం. ప్రపంచానికే కొవిడ్‌ పెద్ద సవాల్‌గా మారింది. గత ఏడాది మార్చిలో ఏపీలో తొలి కేసు నమోదైంది. అప్పట్లో శాంపిల్స్‌ పుణె పంపాల్సిన పరిస్థితులు ఉండేవి.. ఇప్పుడు ఏపీలో 150కి పైగా ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. తొలి వేవ్‌లో 261 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే.. సెకండ్‌ వేవ్‌లో 649 ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలు మనకు లేవు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలు రాష్ట్రంలో లేవు. కొవిడ్‌ నియంత్రణకు 2,229 కోట్లు ఖర్చు చేశాం. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చాం’’ అని జగన్‌ తెలిపారు.

Updated Date - 2021-05-20T20:12:40+05:30 IST