రహేజా మైండ్‌స్పేస్ తరహాలో..విశాఖలో ఐటీ పార్కు!
ABN , First Publish Date - 2021-02-27T08:46:07+05:30 IST
హైదరాబాద్‌లోని రహేజా మైండ్‌స్పేస్ ఐటీ పార్కు తరహాలో విశాఖపట్నంలో కూడా ఐటీ పార్కు అభివృద్ధి చేయాలని.. ఇందుకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి
ప్రణాళిక తయారీకి మేకపాటి ఆదేశం
మనకు కావలసింది బీపీవో జాబులు కాదు
అత్యున్నత నైపుణ్య ఉద్యోగాలు కావాలి
సర్వే పూర్తికాగానే పరిశ్రమలకూ ఇక ఆధార్
ఐటీ శాఖ సైట్ అప్‌డేట్ కాలేదని ఆగ్రహం
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని రహేజా మైండ్‌స్పేస్ ఐటీ పార్కు తరహాలో విశాఖపట్నంలో కూడా ఐటీ పార్కు అభివృద్ధి చేయాలని.. ఇందుకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖలో మిలీనియం టవర్స్‌ను ఆనుకుని ఉన్న 9 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సూచించారు. శుక్రవారం ఆయన ఈ శాఖలపై సమీక్ష నిర్వహించారు. తొలుత ఐటీ శాఖపై జరిపిన సమీక్షలో.. ఐటీ పార్కు అభివృద్ధి ద్వారా వీలైనన్ని ఎక్కువ నాణ్యమైన ఉద్యోగాలందించాలని మంత్రి ఆదేశించారు. యువత గర్వంగా చెప్పుకునే ఐటీ ఆధారిత ఉద్యోగాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 8 వేల బీపీవో ఉద్యోగాలు కల్పిస్తామని ఒక సంస్థ ముందుకొచ్చిందని.. అయితే ఐటీ శాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్ కోరుకుంటోంది బీపీవో ఉద్యోగాలు కాదని చెప్పారు. అత్యున్నత ఐటీ ఉద్యోగాల కల్పన జరిగేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
రాబోయే రోజుల్లో ఐటీపై మరింత ఎక్కువ శ్రద్ధ పెడతానన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. అనుకుంటే అనువైన అవకాశాలుగా మలుచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వానికి అన్ని శాఖల్లో వివిధ రకాలుగా సేవలందించేది ఐటీ శాఖ మాత్రమేనన్నారు. వివిధ శాఖలకు అవసరమైన వస్తువుల కొనుగోళ్లు, సేవలు ఐటీ శాఖ ద్వారానే జరిగేటట్లు చూడాలని అధికారులను నిర్దేశించారు. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి అన్నీ ఐటీ శాఖ ద్వారానే కావాలన్నారు. తొలుత తాను చూస్తున్న పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, చేనేత, ఐటీ తదితర శాఖల్లో ఈ విధానం అమలుచేస్తామని వెల్లడించారు. అయితే, ఐటీ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్ అప్‌డేట్‌గా లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐటీ శాఖే ఇలా ఉంటే ఎలాగని, 48 గంటల్లో ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. అర్హత, సామర్ధ్యం కలిగిన వారికి బాధ్యతలు అప్పగించి సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉండాలన్నారు.
10 రంగాల్లో 23,490 కొలువులు..
పౌరులకు ఆధార్ గుర్తింపు లాగే..పరిశ్రమలకూ ఇకపై ఆధార్ ఉంటుందని గౌతమ్‌రెడ్డి తెలిపారు. జాబ్ ఫెయిర్, స్కిల్ కనెక్ట్ డ్రైవ్ కార్యక్రమాల ద్వారా 10రంగాల్లో 23,490మందికి ఉద్యోగాలు అందించగలిగామని మంత్రి తెలిపారు. ఐటీ, ఎలక్ర్టానిక్స్, నిర్మాణం, టెలికమ్, వైద్య, పర్యాటక, ఆటోమోటివ్ రంగాల్లో 34,184మందికి శిక్షణ ఇచ్చామని, 13,921మందికి ఉద్యోగాలు అందించామని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జీ జయలక్ష్మి తెలిపారు. కరోనా సమయంలోనూ రెండులక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించామని మంత్రికి తెలిపారు. సుమారు 55వేల పైగా పరిశ్రమల సర్వే ఇప్పటివరకు జరిగిందని పరిశ్రమల శాఖ డైరక్టర్ సుబ్రమణ్యం తెలపగా, ఆ సర్వే పూర్తి కాగానే పరిశ్రమలకు ఆధార్ ఇద్దామని మంత్రి తెలిపారు.
‘నేషనల్ అకాడమీ’ డీజీగా జయలక్ష్మి
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ డైరక్టర్ జనరల్‌గా ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి జీ జయలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.