2 రాష్ట్రాలనూ కలిపితే సరి

ABN , First Publish Date - 2021-10-29T08:15:24+05:30 IST

2 రాష్ట్రాలనూ కలిపితే సరి

2 రాష్ట్రాలనూ కలిపితే సరి

టీఆర్‌ఎస్‌ అప్పుడు బేషుగ్గా పోటీ చేయవచ్చు 

కేసీఆర్‌ ఇందుకు చొరవచూపితే రాష్ట్రం తరఫున సహకరిస్తాం

తెలంగాణ కేబినెట్‌లో ఆయనే తీర్మానం చేస్తే బాగు: మంత్రి పేర్ని 


అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలపడానికి తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌ తరఫున తాము సహకరిస్తామని రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టీఆర్‌ఎస్‌ పెట్టాలని అనేక మంది అడుగుతున్నారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఇక్కడ కొత్తగా పార్టీ ఎందుకు? అదే టీఆర్‌ఎస్‌ పార్టీని ఉంచొచ్చు కదా! అంతర్జాతీయ టీఆర్‌ఎస్‌, జాతీయ టీఆర్‌ఎస్‌, ఏపీ టీఆర్‌ఎస్‌, తెలంగాణ టీఆర్‌ఎస్‌ అని ఎందుకు? అసలు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరి. ఏపీలో పార్టీ పెట్టే ముందు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కేసీఆరే తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుంది కదా! రెండు రాష్ట్రాలూ కలిసిపోతే కేసీఆర్‌ భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఓటు ఎవరికి వేస్తే వారే సీఎం అవుతారు’ అని తెలిపారు. కేసీఆర్‌ పథకాలను బండి సంజయ్‌ (తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు) దగ్గర మైకు పెడితే బాగా చెబుతారని వ్యాఖ్యానించారు.


హైదరాబాద్‌కు డ్రగ్స్‌ ఎలా వచ్చాయి?

ఏపీ నుంచే గంజాయి సాగు, రవాణా ఎక్కువగా ఉంటోందంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి పేర్ని తీవ్రంగా స్పందించారు. ‘మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు చెప్పారా? గంజాయి ఇప్పుడే సాగవుతోందా? ఇప్పుడే రవాణా అవుతోందా’ అని ఎదురుప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులు కూడా చెబుతున్నారని.. విశాఖ ఏజెన్సీ నుంచి తెలంగాణకు గంజాయి వస్తోందని నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌ వ్యాఖ్యానించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ‘హైదరాబాద్‌కు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆయన చెప్పలేదా? హైదరాబాద్‌ నిండా ఉన్న డ్రగ్స్‌, మత్తు బిళ్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయో రంగనాథ్‌ను అడగండి’ అని సూచించారు. అమిత్‌షా నుంచి చంద్రబాబుకు ఫోన్‌ వచ్చిన విషయంపై లీకులు ఎందుకు? చేస్తే చేశారని చెప్పుకోవచ్చుగా అని మంత్రి అన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడని అడుగగా.. ఈ మాట ఎవరిని అడగాలో వారినే అడగాలని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ మీకేమీ చెప్పలేదా అని ప్రశ్నించగా.. అన్నీ చెబితే ఆయన సీఎం ఎలా అవుతారని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో పీఆర్సీ, ఫిట్‌మెంట్‌లపై చర్చ జరగలేదని చెప్పారు. 


‘ఎయిడెడ్‌’పై ఒత్తిడి లేదు.. 

ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాల నిర్వహణ విషయంలో ఎవరు ఎవరినీ ఒత్తిడి, బలవంతం చేయడానికి లేదని, యాజమాన్యాలు ఐచ్ఛికంగా మూడు పద్ధతుల్లో ఏదోకటిఎంచుకోవచ్చని మంత్రి పేర్ని చెప్పారు. సగం ఎయిడ్‌, సగం యాజమాన్యం భరించేలా పోస్టుల నియమాకానికి ఇష్టపడినా ఎయిడ్‌ కొనసాగిస్తామన్నారు. పేద విద్యార్థులకు విద్య అందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన ఎయిడెడ్‌ విద్యా సంస్థలను.. ఆర్థిక పరిస్థితి సరిలేక, ప్రభుత్వ నియంత్రణను భరించలేక యాజమాన్యాలు వాటిని నడపలేకపోయినా.. తాతలు, తండ్రుల ఆశయాలకు కొనసాగాలని భావిస్తే, వాటిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించినా.. పేర్లు మార్చకుండా ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపారు. లేదంటే ఉపాధ్యాయులను ప్రభుత్వానికి అప్పగించి, విద్యా సంస్థలను యాజమాన్యాలే ప్రైవేటుగా నడుపుకొంటామన్నా సరేనన్నారు. ఎయిడెడ్‌ సంస్థలను ప్రభుత్వం లాగేసుకుంటుందనే ప్రచారం సరికాదన్నారు. సిగ్గూ, శరం, చీమూ నెత్తురూ ఉంటే ఇలాంటి ఆరోపణలు చేయరని మండిపడ్డారు. జనాభా లెక్కల్లో కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెబుతూ.. స్వాతంత్య్రం వచ్చాక 1931లో మాత్రమే కులప్రాతిపదికన జనగణన జరిగిందని మంత్రి తడబాటుతో అన్నారు. 1947 తర్వాత జరగలేదని చెప్పారు.

Updated Date - 2021-10-29T08:15:24+05:30 IST