ఉద్యోగులను వంచించడం మంచిదికాదు

ABN , First Publish Date - 2021-12-30T08:44:33+05:30 IST

‘‘సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ప్రభుత్వోద్యోగులకు మాటిచ్చారు. అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు.

ఉద్యోగులను వంచించడం మంచిదికాదు

సీపీఎస్‌పై మాటిచ్చారు... మడమ తిప్పారు: రఘురామ

న్యూఢిల్లీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘‘సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ప్రభుత్వోద్యోగులకు మాటిచ్చారు. అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ పాలనలో కీలకపాత్ర పోషించే ఉద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేయడం మంచిదికాదు’’ అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. జగన్‌రెడ్డిని సీఎంని చేస్తే వారంలోనే సీపీఎస్‌ కచ్చితంగా రద్దు చేస్తారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ప్రగల్భాలు పలికిన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇపుడు మాట త ప్పినందుకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.  టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణను హతమార్చేందుకు కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించిన వివాదంపై తక్షణమే ప్రత్యేక విచారణ జరిపించి, అసలైన దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాధాపై జరగరానిది ఏదైనా జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. సీఎంగా జగన్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రిగా అప్పలరాజు వచ్చాక 5లీటర్ల పాలు ఇచ్చే గేదె... ఇపుడు 9లీటర్లు ఇస్తోందని ఎద్దేవా చేశారు. అప్పలరాజుకు భారతరత్న తరహాలో ‘పాడిరత్న’ పురస్కారం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జగనన్న పాలవెల్లువ పేరుతో ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ను అమూల్‌ పాల సంస్థగా మార్చేస్తున్నారని విమర్శించారు. ఒక ప్రైవేట్‌ పాల కంపెనీపై సీఎంకి ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ? అని నిలదీశారు. సినీహీరో సిద్ధార్థ్‌కి ఏపీతో పనేంటని ప్రశ్నించిన మంత్రి పేర్ని నానీని... జస్టిస్‌ చంద్రు, జస్టిస్‌ కనగరాజుకు ఏపీతో పనేంటని ప్రజలు అడుగుతున్నారన్నారు. రాష్ట్రంలోని ఎర్రచందనాన్ని దోచేస్తున్నట్లుగా  కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ చెప్పారని, ఈ ఆరోపణను సీఎం జగన్‌రెడ్డి తీవ్రంగా పరిశీలించాలన్నారు. 

Updated Date - 2021-12-30T08:44:33+05:30 IST