పార్టీ బాగే ముఖ్యం

ABN , First Publish Date - 2021-08-21T09:28:12+05:30 IST

‘‘పార్టీ బాగే ముఖ్యం. పార్టీ నేతలు, కార్యకర్తల పట్ల పార్టీ

పార్టీ బాగే ముఖ్యం

  • ఆయారాం, గయారాంలకు అవకాశం టీడీపీకి నష్టం
  • సీనియర్లకు, వివిధ వర్గాలకు సమ ప్రాధాన్యం ఉండాలి
  • ‘దేశం’ పని విధానం మారాలి
  • నేతలకు స్పష్టం చేసిన ‘గోరంట్ల’
  • ఆయన అభిప్రాయాలను బాబు పరిగణనలోకి తీసుకుంటారు: గద్దె రామ్మోహన్‌


రాజమహేంద్రవరం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ‘‘పార్టీ బాగే ముఖ్యం. పార్టీ నేతలు, కార్యకర్తల పట్ల పార్టీ అధిష్ఠానం తీరు సక్రమంగా ఉండాలి. పార్టీ పని విధానం మారాలి. ఇటీవల నియమించిన కమిటీల్లో సమతుల్యత లేదు. అన్ని వర్గాలకు, పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లకు ప్రాధాన్యం ఉండాలి. గాలిలో గెలుస్తామనుకుంటే మంచిది కాదు. పార్టీని మరింత పటిష్ఠ పరచాలి’’ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు. గోరంట్ల అలకబూనిన నేపథ్యంలో గురువారం చంద్రబాబు ఆయనతో నేరుగా ఫోనులో మాట్లాడిన విషయం, పలువురు నేతలూ స్వయంగా వచ్చి కలిసిన విషయం తెలిసిందే.


తాజాగా శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చన్నాయుడు ఆదేశాల మేరకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, మాజీ మంత్రి కేఎస్‌.జవహర్‌, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.రామకృష్ణారెడ్డి, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు గోరంట్ల నివాసానికి వచ్చారు. సుమారు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బుచ్చయ్య తన అభిప్రాయాలను పార్టీ నేతలతో నిర్మొహమాటంగా పంచుకున్నారు.


విశ్వసనీయ సమాచారం మేరకు... పార్టీలోని కొన్ని సమస్యలను ఎత్తి చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నియమించిన కమిటీల్లో కొందరికి అన్యాయం జరిగిందన్నారు. ఆయారాం గయారాంలకు అవకాశం ఇవ్వడం వల్ల పార్టీకి మేలు జరగదని తెగేసి చెప్పారు. గత ఎన్నికల ముందు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి అవకాశం ఇచ్చి దెబ్బతిన్నామని వివరించారు. ‘‘నాకేం సమస్య లేదు. పార్టీ కోసం, కార్యకర్తల గుర్తింపు కోసమే నా తాపత్రయం. నా ఫోన్‌కు కూడా అధిష్ఠానం రెస్పాండ్‌ కాకపోతే ఎలా! నేనెవరికి చెప్పాలి? సమస్యలు ఎలా పరిష్కరించాలి? ఏమీ చేయలేనప్పుడు నేనెందుకు?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సిటీకి చెందిన సుమారు 10 మంది సీనియర్ల పేర్లతో కూడిన జాబితాను రాజప్ప, గద్దె రామ్మోన్‌లకు ఇచ్చిన బుచ్చయ్య చౌదరి... వారితో మాట్లాడి, పరిస్థితి ఏమిటో తెలుసుకోవా


లని కోరారు. ఇటీవల పార్టీ నుంచి వైసీపీ, బీజేపీలోకి వెళ్లిపోయిన నేతలతో కూడా మాట్లాడాలని సూచించారు. దీనిపై స్పందించిన గద్దె రామ్మోహన్‌, రాజప్ప తదితరులు... ‘‘ఇవన్నీ అధిష్ఠానం దృష్టికి తీసుకొని వెళతాం. మీ అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుందాం’’ అని చెప్పినట్టు తెలిసింది.


గోరంట్ల అసంతృప్తితో లేరు: గద్దె రామ్మోహన్‌

‘‘గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన పార్టీని ఆరాధించే నేత. ఆయన అభిప్రాయాలను ఎప్పుడూ చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారు. ఆయన పార్టీ గురించి కొన్ని అభిప్రాయాలు చెప్పారు. అవన్నీ అధిష్ఠానం దృష్టికి తీసుకుని వెళతాం’’ అని  టీడీపీ నేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్‌ జవహర్‌, రామకృష్ణారెడ్డి, గన్ని కృష్ణ, ముళ్లపూడి బాపిరాజులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.


‘‘బుచ్చయ్య చౌదరి నాకు వ్యక్తిగతంగా గురుతుల్యులు.  రాష్ట్రంలో పార్టీని మరింతగా పటిష్ఠ పరచుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. రాజమహేంద్రవరం నియోజకవర్గంలో చిన్నచిన్న సమస్యలు, సమన్వయం లేని విషయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా చర్చించాం’’ అని వివరించారు. కచ్చితంగా గోరంట్ల అభిప్రాయాలను చంద్రబాబు పరిగణనలో తీసుకుంటారన్నారు. గోరంట్ల మనోభావాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకుని వెళతామని, ఆయన సమన్వయం చేస్తారని వివరించారు. గోరంట్ల అసంతృప్తిపై మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ... ‘‘ఆయన అసలు అసంతృప్తి చెందలేదు. పార్టీలోని కొన్ని సమస్యలను చెప్పారు. అవన్నీ పరిష్కరించుకుంటాం’’ అని గద్దె వివరించారు.


Updated Date - 2021-08-21T09:28:12+05:30 IST