పన్నులు వేస్తాం..మేం కట్టం!
ABN , First Publish Date - 2021-07-01T08:14:17+05:30 IST
ప్రజలపై ఆస్తిపన్ను బాదుడుకు సిద్ధమైన జగన్... తన సొంత నివాసానికి మాత్రం పన్ను కట్టడం ‘మరిచిపోయారు’. గత రెండేళ్లుగా ఆయన తన ఇంటి పన్ను చెల్లించడం లేదు

ముఖ్యమంత్రి సందేశం ఇదేనా?
సొంత ఇల్లు, కార్యాలయానికి ఆస్తిపన్ను బకాయి
సీఎం అయినప్పటి నుంచి కట్టని వైఎస్ జగన్
తాడేపల్లిలో ఆయన సతీమణి పేరిట భవనాలు
అసలు 13.85 లక్షలు.. జరిమానా 2.82 లక్షలు
మునిసిపల్ శాఖకు రూ.16.67 లక్షలు బాకీ
‘మేం పాలకులం. మేం పన్నులు వేస్తాం. ప్రజలు కట్టాలి. కానీ, మా జేబు నుంచి మాత్రం మేం పన్నులు కట్టం!’... అని అనుకున్నారా? లేక... ‘ఎవరికైనా, ఎక్కడైనా రూల్స్ అమలవుతాయి. మమ్మల్ని అడిగేదెవరు!’ అని భావిస్తున్నారా? లేక... ‘ఆస్తి పన్ను’ అనేది ఒకటి ఉంటుందని, తామూ కట్టాలని మరిచిపోయారా? ఇందులో ఏం జరిగిందో తెలియదు! కానీ... విపక్ష నేతలు ‘తాడేపల్లి ప్యాలెస్’గా పిలిచే జగన్ నివాసం, కార్యాలయ భవనాలకు రెండేళ్లుగా ఆస్తిపన్ను కట్టడంలేదు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రజలపై ఆస్తిపన్ను బాదుడుకు సిద్ధమైన జగన్... తన సొంత నివాసానికి మాత్రం పన్ను కట్టడం ‘మరిచిపోయారు’. గత రెండేళ్లుగా ఆయన తన ఇంటి పన్ను చెల్లించడం లేదు. కాస్తాకూస్తా కాదు... గుంటూరు జిల్లా తాడేపల్లి మునిసిపాలిటీకి ఆయన రూ.16లక్షలకుపైగా బాకీ పడ్డారు. మునిసిపల్ శాఖ వెబ్సైట్లోనే ఈ విషయం వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌కు తాడేపల్లిలో భారీ నివాసం ఉంది. అందులో రెండు బ్లాక్‌లున్నాయి. 1750 చదరపు మీటర్ల పరిధిలో ఆఫీసు ఉంది. ఇందులో గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి. మునిసిపల్ రికార్డు ప్రకారం దీని చిరునామా.. డోర్ నంబరు 12-353/2/2 పార్సివిల్లే 47, ఆంధ్రరత్న కట్ట, రెవెన్యూ వార్డు నంబరు 12, తాడేపల్లి - 522501. ఇక... ఇదే ఆవరణలో 219 చదరపు మీటర్లలో నివాసంఉంది. దీని డోర్ నంబర్ 12-353/2/5. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. ఈ రెండూ సీఎం సతీమణి వైఎస్ భారతీ రెడ్డి పేరిట ఉన్నాయి. మునిసిపల్ రికార్డుల ప్రకారం ఆఫీసు కోసం ఉపయోగిస్తున్న భారీ భవనాన్ని కమర్షియల్‌గా, ఇంటిని నివాస ప్రాంతంగా చూపించారు. వార్షిక రెంటల్ విలువను ఆఫీసుకు రూ. 13,64,131గా, ఇంటికి రూ.79,524 చూపించి... ఆ మేరకు ఆస్తి పన్ను నిర్ణయించారు. దీని ప్రకారం.. ఆఫీసుకు ఏటా రూ.4,41,980... ఇంటికి 19,752 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ.. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇంటికి కానీ, కార్యాలయానికి కానీ ఆస్తి పన్ను చెల్లించడంలేదు.
మునిసిపల్‌శాఖ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారమే కార్యాలయంపై రూ.13,25,940 పన్ను బాకీ పడ్డారు. ఇంటికి సంబంధించి 59,256 పన్ను బకాయి ఉంది. అంటే... మునిసిపల్ శాఖకు జగన్ రూ.13,85,196 పన్ను బాకీ పడ్డారు. ఏళ్ల తరబడి పన్నులు కట్టకుండా ఉంటే మునిసిపల్ శాఖ ఊరుకోదు కదా! ఆటోమేటిక్‌గా పెనాల్టీలు పడతాయి. ఆ జరిమానా రూ.2,82,103. వెరసి అసలూ, జరిమానాలు కలిపి భారతీ రెడ్డి మునిసిపల్ శాఖకు రూ.16,67,299 బాకీ పడ్డారు.
సీఎం పన్ను కట్టరా?
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ఆఫీసు, ఇంటి నిర్మాణం చేపట్టారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆస్తి పన్ను కట్టడంలేదు. సీఎం అయ్యారు కాబట్టి పన్ను కట్టాల్సిన అవసరం లేదని... ఆయన నివాసం, కార్యాలయానికి ప్రభుత్వమే పన్ను చెల్లించాలని ఎవరైనా అనుకోవచ్చు. కానీ... అది కుదరదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌కు వేతనం, ఇతర అలవెన్సులు ప్రభుత్వ ఖజానా నుంచి లభిస్తాయి. ఆయన తరఫున ప్రభుత్వమే ఆదాయపు పన్ను చెల్లిస్తుంది. ఒకవేళ ఆయన ప్రభుత్వ భవనంలో నివసిస్తుంటే... దాని ఆస్తిపన్ను, ఇతర పన్నులు కూడా ప్రభుత్వమే చెల్లించేది. కానీ... జగన్ ఉంటున్నది ప్రైవేటు భవనాలలో! వాటి యజమాని... ఆయన సతీమణి అయిన భారతీ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్స్ యాక్ట్-1953 ప్రకారం... ‘‘సీఎం, ఉపముఖ్యమంత్రి, లేదా మంత్రులకు ప్రభుత్వం అధికారిక నివాసాలను సమకూర్చితే... వాటి నిర్వహణ సర్కారు చూసుకుంటుంది. ఒకవేళ ప్రైవేటు నివాసాల్లో ఉంటే, సంబంధిత భవన యజమానే స్థానిక పన్నులు భరించాలి’’ అని స్పష్టంగా చెప్పారు. ఈ నిబంధన ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు, ఇల్లు కొలువుదీరిన భవనాలకు వైఎస్ భారతీ రెడ్డి పన్ను చెల్లించాలి.
కొసమెరుపు: సామాన్యుల్లో ఎవరికైనా వంద లేదా 200 గజాల్లో ఇల్లు/వాణిజ్య భవనం ఉండి, దానికి ఆస్తిపన్ను సరిగ్గా కట్టకపోతే ఏం జరుగుతుంది? పెనాల్టీలు, దానిపై వడ్డీలు, చక్రవడ్డీలు వేసి వసూలు చేస్తారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ఇతర సదుపాయాలు ఆపేస్తారు. ఇంకా నోటీసులు అంటిస్తారు. అదే ముఖ్యమంత్రి కుటుంబం 16 లక్షలకుపైగా పన్ను బకాయిలు ఉంటే?