‘రెక్కీ’పై విచారణ జరపండి

ABN , First Publish Date - 2021-12-30T08:23:22+05:30 IST

విజయవాడ నగర టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ నిర్వహించిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

‘రెక్కీ’పై విచారణ జరపండి

  • రాధాకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
  • డీజీపీకి చంద్రబాబు లేఖ.. అండగా ఉంటామని ప్రకటన
  • గన్‌మెన్లను తిరస్కరించడం సరికాదు.. ‘వంగవీటి’కి బాబు ఫోన్‌


అమరావతి, విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నగర టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ నిర్వహించిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. ఎవరి ప్రభావమూ లేకుండా త్వరగా ఈ విచారణ జరిగితేనే అసలు నిందితులు బయటకు వస్తారన్నారు. అలాంటి వారికి కఠిన శిక్షలు పడితేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. కొందరు వ్యక్తులు తనను అనుసరిస్తూ తనపై రెక్కీ నిర్వహిస్తున్నారని రాధా స్వయంగా చెప్పారు. ఇటువంటి వ్యవహారాలు పట్టపగలు జరుగుతున్నాయంటే ఈ రాష్ట్రంలో ఆటవిక, గూండా రాజ్యం ఎంతలా వేళ్లూనుకుందో తెలుస్తోంది. గతంలోనూ ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినా.. నిజమైన నిందితులను పట్టుకొని శిక్షించడానికి గట్టి ప్రయత్నం జరగలేదు. రాధాపై రెక్కీ జరిగిన సంఘటనలో తక్షణమే పోలీస్‌ శాఖ కదలాలి. రాధాకు ఏదైనా హాని జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని బాబు తన లేఖలో స్పష్టం చేశారు


కుట్ర రాజకీయాలపై పోరాడుదాం: బాబు

‘‘గన్‌మెన్లను తిరస్కరించడం సరికాదు. కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం’’ అని చంద్రబాబు, వంగవీటి రాధాకృష్ణతో అన్నారు. బుధవారం ఆయన రాధాకు ఫోన్‌ చేశారు. రెక్కీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ, తాను అండగా ఉంటామని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కాగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటికి కేటాయించిన గన్‌మెన్లు విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న కార్యాలయానికి వచ్చారు. బుధవారం రాధా కార్యాలయానికి  రాలేదు. దీంతో వారు తిరిగి వెళ్లిపోయారు. తనకు కేటాయించిన గన్‌మెన్లను రాధా తిరస్కరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గన్‌మెన్లు వచ్చి వెనుదిరగడం గమనార్హం. మరోవైపు ఆయన అనుచరులు భారీగా కార్యాలయం వద్దకి చేరుకున్నారు. 


రాధా హత్యకు వైసీపీ పన్నాగం: రాజప్ప

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణను హత్య చేసి రాష్ట్రంలో కుల చిచ్చు రేపాలని వైసీపీ నాయకత్వం పన్నాగం పన్నుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఆరోపించారు. బుధవారం ఆయన దీనిపై ఒక ప్రకటన చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్‌ రెడ్డి వారి దృష్టి మళ్లించడానికి ఇటువంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 

Updated Date - 2021-12-30T08:23:22+05:30 IST