ఏ పరీక్షకు సిద్ధమవ్వాలి సార్‌?

ABN , First Publish Date - 2021-08-10T08:44:06+05:30 IST

ఆ అమ్మాయి పేరు ప్రణతి. కరోనా కాలంలో ఎలాగోలా ఇంటర్‌ ఫస్టియర్‌ పూర్తిచేసి.. ఇప్పుడు ఇంటర్‌ సెకండియర్‌కు వచ్చింది. కొవిడ్‌ కారణంగా పరీక్షలు పెట్టకుండా ‘ఆల్‌ పాస్‌’ అని ప్రభుత్వం ప్రకటించింది...

ఏ పరీక్షకు సిద్ధమవ్వాలి సార్‌?

  • ఇంటర్‌ ఫస్టియర్‌కా? సెకండియర్‌కా?
  • ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల ఆందోళన
  • సప్లిమెంటరీ పరీక్షలపై తీవ్ర గందరగోళం
  • రెండో ఏడాది మార్కులనే పరిగణనలోకి
  • తీసుకుని తుది మెమో ఇవ్వాలని డిమాండ్‌
  • ఎక్కడా లేని విధానం ఇక్కడెందుకని ప్రశ్న

(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ఆ అమ్మాయి పేరు ప్రణతి. కరోనా కాలంలో ఎలాగోలా ఇంటర్‌ ఫస్టియర్‌ పూర్తిచేసి.. ఇప్పుడు ఇంటర్‌ సెకండియర్‌కు వచ్చింది. కొవిడ్‌ కారణంగా పరీక్షలు పెట్టకుండా ‘ఆల్‌ పాస్‌’ అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పుడు రెండో సంవత్సరం సబ్జెక్టులకు సంసిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం సెప్టెంబరులో ఇంటర్‌ మొదటి సంవత్సరానికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో ఆ అమ్మాయి ఒత్తిడికి గురవుతోంది. ఇప్పుడు మళ్లీ ఇంటర్‌ ఫస్టియర్‌ సబ్జెక్టులు చదవాలా? లేకుంటే రెండో ఏడాదివి అధ్యయనం చేయాలా? లేక నీట్‌కు ప్రిపేర్‌ కావాలా? అన్న గందరగోళంతో మానసిక ఆందోళన నెలకొంది. ‘ఆల్‌ పాస్‌’ విధానాన్ని ఎంచుకున్న ప్రభుత్వం ఇప్పుడు ‘రివర్స్‌’ విధానంలో మళ్లీ సప్లిమెంటరీ నిర్వహిస్తామనడంతో  విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఫస్టియర్‌, సెకండియర్‌ ఇంటర్‌ సబ్జెక్టుల మీదే మళ్లీ దృష్టిపెట్టాల్సి వస్తే.. ఇంజనీరింగ్‌, వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో జరిగే జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షల్లో వెనుకబడి పోతామనే ఆందోళన వీరిలో నెలకొంది. ప్రభుత్వం సరైన ఆలోచన చేసి ఈ పరీక్షలను రద్దు చేస్తే విద్యార్థులు గత సంవత్సరం సబ్జెక్టులపై కాకుండా.. ఈ ఏడాది చదువు మీద, అదేవిధంగా జాతీయ స్థాయి పరీక్షల మీద దృష్టి కేంద్రీకరిస్తారని నిపుణులు చెబుతున్నారు.


సమయం చాలదు సార్‌!

సెప్టెంబరులో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఇటీవల పేర్కొన్నారు. ‘‘గత ఏడాది అంటే 2020-21విద్యా సంవత్సరంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివిన వారందరినీ పాస్‌ చేశాం. అయితే వారికి పాస్‌మార్కుల పట్ల సంతృప్తి లేకుంటే సప్లిమెంటరీ పరీక్ష రాసుకోవచ్చు. ఈ ఏడాది అంటే 2021-22విద్యాసంవత్సరంలో సెకండియర్‌లోకి వచ్చిన వారంతా మళ్లీ మొదటి ఏడాది సబ్జెక్టులకు సప్లిమెంటరీ రాసుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. అయితే, 2020-21లో సెకండియర్‌ పూర్తిచేసుకున్నవారికి కూడా పరీక్షలు నిర్వహించకపోవడంతో.. పదో తరగతి మార్కులు 30ు, ఇంటర్‌ మొదటి ఏడాది మార్కులకు 70శాతం వెయిటేజి ఇచ్చి మార్కులు కేటాయించారు. ఇప్పుడు వీరికి కూడా మళ్లీ సెకండియర్‌కు సప్లిమెంటరీ రాసుకోవచ్చని సూచించారు. ఈ పరీక్షలన్నీ సెప్టెంబరులో నిర్వహిస్తామన్నారు. అంటే పరీక్షలకు ముందు రెండు, మూడువారాలు, పరీక్షలు జరిగే వారం రోజులు.. మొత్తంగా ఒక నెలరోజుల పాటు మళ్లీ మొదటి ఏడాది సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. వాస్తవానికి సెకండ్‌ ఇంటర్‌ విద్యార్థులకు ఫలితాలపై అంతగా అసంతృప్తి లేదు. వారికి పదో తరగతి, ఇంటర్‌ మొదటి ఏడాది మార్కుల ఆధారంగా తుది మార్కులివ్వడంతో మంచి ఫలితాలే వచ్చాయి. దీంతో వీరంతా జేఈఈ-మెయిన్స్‌, నీట్‌ పరీక్షల మీద దృష్టిపెట్టవచ్చు. లేదంటే ఇతర ప్రవేశపరీక్షలకు ప్రిపేర్‌ కావొచ్చు. ఇక, ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులకు మాత్రం కొంత అసంతృప్తి ఉంది. మెరిట్‌ విద్యార్థులు తమకు కేవలం పాస్‌మార్కులేనా? అనుకోవచ్చు. అయితే వారు కూడా ఇప్పుడు మళ్లీ పరీక్షలు పెట్టాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే సెకండియర్‌లో ఉంటూ ఫస్టియర్‌ పరీక్షలు సెప్టెంబరులో రాయాలంటే మళ్లీ నెలరోజుల సమయం వృథా అవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగే జేఈఈ మెయిన్స్‌, ఇతర ప్రవేశ పరీక్షలకు సిద్దమవ్వాలి. ఇది తీవ్రమైన ఒత్తిడి కలిగించే విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


ఏ రాష్ట్రంలోను లేనిది ఇక్కడేనా?

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. అయితే, మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలను పెడతామని ఏరాష్ట్రమూ ప్రకటించలేదు. మరి ఎక్కడా లేనిది రాష్ట్రంలోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయంతో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సంసిద్దమయ్యే సమయం లేకుండా చేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకపోతే.. జాతీయ స్థాయిలో రాష్ట్ర ర్యాంకర్లు విఫలమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరీక్షలకు బదులుగా ప్రత్యామ్నాయం ఆలోచించాలని సూచిస్తున్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారని అనుకుంటే.. వారికి వచ్చే ఏడా ది నిర్వహించే రెండో ఏడాది పరీక్షలనే ప్రామాణికంగా తీసుకుని రెండేళ్లకు మార్కులు కేటాయించవచ్చని చెబుతున్నారు. ఇదీ కాకుంటే మరో ప్రత్యామ్నాయ పద్ధతిలోనైనా మార్కులు ఇవ్వవొచ్చని సూచిస్తున్నారు. అంతే తప్ప సప్లిమెంటరీ పరీక్షల విధానం అన్నది సరికాదని, ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-08-10T08:44:06+05:30 IST